epaper
Monday, February 23, 2026
epaper

నల్లగొండ పర్యాటకానికి కలెక్టర్ మాస్టర్ ప్లాన్.. ‘అడ్వెంచర్‌’కు అడుగులు పడేనా!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda)  జిల్లా చారిత్రక సంపద పెట్టింది పేరు. ఇటువైపు ఆధ్యాత్మికత.. అటువైపు అడ్వెంచర్.. మరోవైపు పోరాటాల గడ్డగా ఈ జిల్లాకు పేరుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మినహా పర్యాటకంగా పెద్దగా డవలప్‌మెంట్ జరిగిందేదీ లేదంటే అతిశయోక్తి కాదు. సాగర్‌లో ప్రధాన డ్యామ్ మినహా పెద్దగా అడ్వెంచర్ తరహా ఏర్పాట్లు శూన్యమనే చెప్పాలి. అలాంటి నల్లగొండ జిల్లాపై కలెక్టర్ చంద్రశేఖర్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే పర్యాటకంపై ఫోకస్ పెట్టారు. ఆధ్యాత్మిక పర్యాటకంతోపాటు అడ్వెంచర్‌కు వీలు ఉండేలా సరికొత్త హంగులు అద్దేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ప్రధానంగా నల్లగొండ జిల్లాలోని చారిత్రక సంపద, ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా పర్యాటక రంగం రూపురేఖలు మార్చబోతున్నారు.

పర్యాటక కేంద్రాలపై మాస్టర్ ప్లాన్

నల్లగొండ జిల్లాలో చారిత్రక ప్రాంతాలతో పాటు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాంతాల్లో టూరిస్ట్‌లు ప్రకృతిలో పరవశించేలా ప్లాన్ రెడీ అవుతోంది. అందులో భాగంగానే రోప్‌వేలకు సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఆధ్యాత్మిక విషయానికొస్తే.. పానగల్ ఛాయా సోమేశ్వరాలయంతోపాటు నకిరేకల్ మండలంలోని పాలెం లక్ష్మీనృసింహా ఆలయం, దేవరచర్ల శివాలయం, చెర్వుగట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టారు. దీంతోపాటు ప్రకృతిలో సేదతీరేలా అక్కెనపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అజిలాపురం జలపాతం, కాశిరాజుపల్లి ఏలేశ్వరం, నల్లగొండ జిల్లా కేంద్రంలోని లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్టను డవలప్ చేయబోతున్నారు. లతీఫ్ సాబ్ గుట్ట, కాపురాల గుట్టలపై రోప్‌వేలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సాంకేతికతపై ఇప్పటికే పేపర్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు డిండి ప్రాజెక్టులో బోటింగ్ చేసేలా ఏర్పాట్లు చేయడంతోపాటు నెల్లికల్లు రిజర్వు ఫారెస్ట్‌లో ఏకో టూరిజాన్ని డెవలప్ చేసేందుకు పక్కాగా అడుగులు పడుతుండటం గమనార్హం.

పర్యాటకంతో యువతకు ఉపాధి

నల్లగొండ ((Nalgonda) జిల్లాలో పర్యాటకం అభివృద్ధి చేస్తే స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు. హోమ్ స్టేలు, స్థానిక వంటకాలతో ఫుడ్ కోర్టులు.. యువతకు టూరిస్ట్ గైడ్లుగా శిక్షణ, రవాణా సౌకర్యాల ద్వారా ఆదాయం కల్పించడం.. హస్తకళల కేంద్రాల ఏర్పాటు లాంటి అంశాలను కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలిస్తున్నారు. నల్లగొండ జిల్లా కేవలం వ్యవసాయానికే కాకుండా, పర్యాటకానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు జరిపి నివేదికలు సమర్పిస్తే, రానున్న రోజుల్లో నల్లగొండ జిల్లా తెలంగాణ పర్యాటక చిత్రపటంలో తలమానికంగా నిలవడం ఖాయమని చెప్పాలి.

మరుగున పడ్డ పర్యాటకం

వాస్తవానికి నల్లగొండ జిల్లాలో చాలా పర్యాటక (Tourism) ప్రాంతాలు ఉన్నప్పటికీ మరుగునపడిపోయాయి. హైదరాబాద్ నుంచి కేవలం గంటన్నర నుంచి 2 గంటల్లో జిల్లాకు చేరుకోవచ్చు. జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో పాటు బ్యాక్ వాటర్ వైజాగ్ కాలనీ టూరిస్టులను ఆకర్షిస్తోంది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. అక్కడికి పర్యాటకులు బారులుదీరుతుంటారు. కానీ అక్కడ పర్యాటకులకు కనీస సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. ఉదయం వచ్చిన పర్యాటకులు సాయంత్రమైతే.. ఇంటిబాట పట్టాల్సిందే. లేకుంటే ఇబ్బందులు పడాల్సిందే. మరోవైపు మూసీ ప్రాజెక్టుకు చారిత్రక నేపథ్యం ఉన్నా.. అక్కడ కనీస సౌకర్యాలు లేవు. దీంతో ఆ ప్రాజెక్టు పర్యాటకానికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఇప్పటికైనా కలెక్టర్ పుణ్యమంటూ జిల్లాలో పర్యాటకం గాడిన పడుతుందా? లేక షరా మాములుగానే మరుగున పడిపోతుందా? అన్నది వేచిచూడాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>