కలం/ఖమ్మం బ్యూరో: దేశవ్యాప్తంగా మావోయిస్టులు కనుమరుగు కాబోతున్నారా? పూర్తిగా తుడిచిపెట్టుకుపోతారా? వారి ఉనికి ప్రశ్నార్థకం అయిపోయిందా? మన దేశంలోని మావోయిస్టులు ఇక చరిత్రలోనే మిగిలిపోతారా? అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ (Operation Kagar) అనంతరం మావోయిస్టులు తమ ప్రాబల్యం పూర్తిగా కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం మండలం ఒకప్పుడు కరడుగట్టిన మావోయిస్టు ప్రాంతం. ఇక్కడ దట్టమైన అడవి ఉండడం వల్ల అన్నలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగించారు. సమీపంలో ఉన్న పగిడేరులో కూడా పీపుల్స్ వార్ కార్యకలాపాలు విస్తృతంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల ప్రజల్లో కూడా సానుభూతి పరులు ఉండేవారు.
ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని తలపించే రీతిలో మావోయిస్టులు పోలీసులకు సవాలు విసిరారు. ఈ క్రమంలో 1992 సెప్టెంబర్ 4న పినపాక, కరకగూడెం మధ్య గల రాళ్ళ వాగు వద్ద మావోయిస్టులు బ్రిడ్జిని పేల్చి వేశారు. ఈ భారీ విస్పోటనానికి ఐదు మందు పాత్రలు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. మావోయిస్టు కదలికలను అరికట్టడానికి కరకగూడెంలో ఒక నూతన పోలీస్ స్టేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1997 జనవరి 9న కరకగూడెం (Karakagudem) పోలీస్ స్టేషన్‌ను కూడా మావోయిస్టులు పేల్చేశారు. క్రమంగా సింగరేణి బొగ్గు గనులు ఏర్పాటు కావడంతో స్థానికులకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరికాయి. మరో పక్క ప్రభుత్వం కూడా ఉక్కు పాదంతో నక్సల్స్ కార్యకలాపాలను అణచి వేసింది. ప్రభుత్వం స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్లు,విద్యుత్ వంటి అవస్థాపన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ కరకగూడెం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి.
కర్రెగుట్టల్లో ఏరివేతే లక్ష్యం
కర్రెగుట్టల్లో (Karregutta) మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ – 1 (Operation Kagar) ప్రభావం వలన ఛత్తీస్‌గఢ్‌లో కూడా మావోయిస్టుల ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ భారీ ఆపరేషన్ 2024 జనవరిలో ప్రారంభమైంది. దీంతో ఇదే సంవత్సరం ఏప్రిల్‌లో కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమారు 29 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 21 నుంచి ఆపరేషన్ కగార్ తీవ్రత పెరిగింది. ఫలితంగా 150 మందికి పైగా మావోయిస్టులు చనిపోయినట్లు వివిధ నివేదికలు చెప్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా కొత్తగూడెం జిల్లాలోనే దాదాపు 300 మంది దళసభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు లొంగిపోయారు. 2025 నవంబర్‌లో అగ్రనేత హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
ఆపరేషన్ కగార్‌తో కకావికలం
2026 ఫిబ్రవరి 17 ఆపరేషన్ కగార్ -2 అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ముఖ్యంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల అడవులను లక్ష్యంగా చేసుకొనే మొదలైంది. సుమారు 2000 మందికి పైగా సీఆర్పీఎఫ్,కోబ్రా, గ్రేహౌండ్స్, డీజీఎఫ్ బలగాలు కూంబింగ్ లో పాల్గొంటున్నాయి.మార్చి 2026 నాటికి నక్సలిజం రహిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా రెండో విడత ఆపరేషన్ నడుస్తోంది. మావోయిస్టు అగ్ర నేతలు దేవ్ జీ,దామోదర్ వంటి వారు లక్ష్యంగా అడవులను జల్లెడ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో నే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ(తిప్పిరి తిరుపతి), రాజిరెడ్డి తో పాటు 16 మంది నక్సలైట్లు ఆసిఫాబాద్‌లో తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది. నంబాల కేశవరావు తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్ జీ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రటరీ గా ఉన్న దేవ్ జీ లొంగిపోవడం అంటే పార్టీ వెన్నెముక విరిగినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మిగిలింది గణపతి, పాపారావు, సాంబయ్య, శుక్రూ, నారాయణతోపాటు మరో వందలోపే ఉండొచ్చని సమాచారం.
ఆరు రాష్ట్రాల పోలీసుల ఆపరేషన్
ఆరు రాష్ట్రాల పోలీసులు కంకణం కట్టుకొని ఆపరేషన్ కగార్ -2 ను (Operation Kagar) అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నే సోమవారం మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకర్లను బలగాలు ధ్వంసం చేశారు. అలాగే నక్సల్స్ అమర్చిన మందు పాత్రలను బాంబు స్వాడ్ డిస్పోజ్ చేయడం జరిగింది. డ్రోన్ల సాయంతో అన్నల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటకుండా భద్రతా బలగాలు అన్నీ సమన్వయం చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. జల్లే, తడపాల, డోలీ అటవీ ప్రాంతాల్లో బలగాలు అణువణువు శోధిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించగా ఆదివారం అగ్ర నేతలతో పాటు 14 మంది లొంగిపోయారు. మిగిలి ఉన్న ఆ కొద్ది మంది కూడా చిక్కితే మావోయిస్టు సాయుధ పోరాటానికి ఎండ్ కార్డు పడటమే కాకుండా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుందని భద్రత వర్గాలు భావిస్తున్నాయి.
పార్టీ తుడిచిపెట్టుకుపోయినట్టేనా?
దేశంలో ప్రధానంగా నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయి. (మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్,)వీటిలో తెలంగాణ పోలిస్శాఖ ఆపరేషన్ చేయూత ద్వారా లొంగుబాటులను విపరీతంగా ప్రోత్సహించిందని చెప్పొచ్చు. లొంగిపోయిన వారికి క్యాడర్లను బట్టి లక్ష నుంచి నాలుగు లక్షలు నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. ఫలితంగా ఛత్తీస్‌గఢ్ నుంచి వందల సంఖ్యలో మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ ముందు లొంగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ వారంలో కూడా తాటి మూక అలియాస్ చూటీ అనే బీజాపూర్ ఏరియా కమిటీ సభ్యుడు లొంగిపోయాడు. అతనికి అప్పటికపుడు 25వేలు నగదు ప్రోత్సాహకం కూడా అందజేశారు. ఒక్క సంవత్సరంలోనే 359 మంది మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ ముందు లొంగిపోయారంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆపరేషన్ చేయూత పథకానికి నక్సల్స్ ఎంతగా ఆకర్షితులయ్యారో అర్థం చేసుకోవచ్చు.
అలాగే పోలీస్ శాఖ అనేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి ఆదివాసీలు మావోయిస్టుల పట్ల ఆకర్షితులవ్వకుండా ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కరకగూడెంలో అన్నలు కనుమరుగు అయినట్లే, కర్రెగుట్టల్లో కూడా కను మరుగు అవుతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన పునాదుల మీద నిర్మించిన మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుందా? లేదా తన వ్యూహాన్ని మార్చుకొని ప్రజల కోసం పోరాడుతోందా? వేచి చూడాల్సిందే.
Read Also: డేటా షేరింగ్‌పై సీసీఐ ఆదేశాలకు ఓకే.. వాట్సాప్, మెటా
Follow Us On : WhatsApp


