కలం, వెబ్ డెస్క్: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు (Telangana Inter Exams) జరగునున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల ఏర్పాట్లు, నిర్వహణ, హాజరుశాతంపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (TGBIE) కీలక వివరాలు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర (జనరల్, వొకేషనల్) పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,89,126 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా.. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో 31 స్క్రీన్లతో పర్యవేక్షణ కొనసాగనుంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షా సమయాల్లో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
విద్యార్థులు తమ హాల్‌టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా కళాశాలల నుంచి పొందవచ్చు. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే (ఉదయం 8:00 గంటలకు) విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా హాల్లోని అనుమతించబడవు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైతే 14416 అనే టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఏవైనా ఇతర ఫిర్యాదులు లేదా సందేహాల కోసం రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్ 040-24655027ను సంప్రదించాలని బోర్డు సూచించింది. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.


