కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కుమ్మెర అమానుష ఘటన(Kummera Incident)పై బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కుమ్మెర మల్లన్న స్వామి జాతర సందర్భంగా చంద్రకళతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్‌తో పాటు అగ్రకుల నిర్వాహకులు దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కావడంతో నాగర్‌కర్నూల్ పోలీసులు కంప్లైంట్ స్వీకరించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. బాధితుల నిరసనతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.


