epaper
Sunday, February 22, 2026
epaper

కుమ్మెర జాతరలో అమానుషం

కలం, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కుమ్మెర మల్లన్న జాతరలో (Kummera Mallanna Jathara) చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఓ కుటుంబంపై నిర్వాహకులు దాడి చేయడంతో రెండు నెలల చిన్నారి మృతి చెందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కుల వివక్ష వల్లే ఈ దాడి జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..  నాగర్‌కర్నూల్ (Nagarkurnool) జిల్లాకేంద్రం సమీపంలో నిర్వహిస్తున్న కుమ్మెర మల్లన్న జాతరకు చంద్రకళ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. అయితే గర్భగుడిలోకి వెళ్లే సమయంలో ఆలయ నిర్వాహకులు అడ్డుకున్నారు. తాము తక్కువ జాతికి చెందినవారమనే కారణంతో గుడిలోకి అనుమతించలేదని చంద్రకళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతరం ఈ వివాదం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో కనిపించింది. దీంతో మరింత ఆగ్రహించిన ఆలయ (Kummera Mallanna Jathara) నిర్వాహకులు తుకారాం రెడ్డి, ఉంద్యాల శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి కన్నిరెడ్డి, కుఫేందర్ రెడ్డి తదితరులు తమ మీద దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. చంద్రకళ, ఆమె కుమారుడు గణేష్, కోడలు, కుమార్తెపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి సమయంలో రెండు నెలల చిన్నారి చేతిలో ఉండగానే తోసినట్టు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

ఆసుపత్రిలో చిన్నారి మృతి

దాడి తర్వాత చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ వైద్యులు ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. చిన్నారి మరణంతో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి ఘటనపై ఫిర్యాదు చేయడానికి నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, పోలీసులు కంప్లైంట్ స్వీకరించలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిందితులు స్థానికంగా ప్రభావం కలిగినవారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

న్యాయం చేయాలంటూ బాధితుల విజ్ఞప్తి

తమ కుటుంబంపై జరిగిన దాడికి కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, తమకు పోలీసు రక్షణ కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్నారి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో సామాజిక వర్గాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుల వివక్ష కారణంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరమని, ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, బాధితుల ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడతామని పోలీసు వర్గాలు తెలిపినట్లు సమాచారం.

Read Also: ఫోన్‌పేలో కొత్త ఏఐ ఫీచర్.. ఇక వాయిస్‌తోనే చెల్లింపులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>