కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులకు చెందిన హెరిటేజ్ సంస్థను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇందాపూర్ డెయిరీకి సంబంధించి ఇప్పటికే వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. మరోవైపు తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు హెరిటేజ్ సంస్థ మీద విమర్శలు గుప్పించారు. అజిత్ పవార్ మృతికి ఈ సంస్థకు ముడిపెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. హెరిటేజ్ సంస్థపై ఎన్సీపీ నేత రోహిత్ పవార్ (Rohit Pawar) సంచలన ఆరోపణలు చేశారు. తన బాబాయ్ అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై ఆయన ఇటీవల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. వీఎస్సార్ ప్రైవేట్ చార్టర్ విమానసంస్థపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అజిత్ పవార్ ప్రమాదంపై దర్యాప్తు నివేదిక రాకముందే, వీఎస్ఆర్ కంపెనీకి రామ్మోహన్ నాయుడు క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చారంటూ రోహిత్ పవార్ ఇప్పటికే ప్రశ్నించారు. వీఎస్ఆర్ కంపెనీ మీద ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఆయన వీఎస్ఆర్ కంపెనీకి, హెరిటేజ్ కంపెనీకి సంబంధాలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
వీఎస్ఆర్ కంపెనీతో హెరిటేజ్‌కు ఆర్థిక లావాదేవీలు
‘అజిత్ పవార్ మృతికి కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న VSR కంపెనీకి హెరిటేజ్ సంస్థతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ లావాదేవీలు అధికారిక పత్రాల్లో నమోదై ఉన్నాయని, కంపెనీకి సంబంధించిన లోన్ రీస్ట్రక్చరింగ్ కూడా జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంబంధాలు, రాజకీయ ప్రభావం మధ్య సంబంధాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. సంబంధిత డాక్యుమెంట్లలో కనిపిస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి, ఆ పార్టీ ముఖ్య నేతలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన వారేనని అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి పారదర్శక విచారణ అవసరమని డిమాండ్ చేశారు.
విచారణపై అనుమానాలు
ఒకవేళ హెరిటేజ్ సంస్థే వీఎస్ఆర్ కంపెనీకి ఆర్థిక సహాయం అందిస్తుంటే, అదే సమయంలో జరుగుతున్న విచారణపై ప్రజలకు ఎలా నమ్మకం కల్పిస్తారని రోహిత్ పవార్ ప్రశ్నించారు. వ్యాపార ప్రయోజనాలు ముందుంటే విచారణ ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. VSR సంస్థకు రక్షణ కల్పించేలా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అజిత్ పవార్‌కు న్యాయం జరగాలంటే విచారణ పూర్తిగా స్వతంత్రంగా, రాజకీయ ప్రభావం లేకుండా జరగాలని అన్నారు.
కేంద్ర సంస్థలపై ఒత్తిడి ఆరోపణ
డీజీసీఏ (DGCA), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ద్వారా జరుగుతున్న విచారణపై కూడా ఒత్తిడి ఉందని రోహిత్ పవార్ ఆరోపించారు. ఆ ఒత్తిడి VSR సంస్థను కాపాడటానికి, కేసు దర్యాప్తు దారి మళ్లించడానికి ఉద్దేశించినదిగా తమకు అనిపిస్తోందని చెప్పారు. ఈ కారణంగానే కేంద్ర స్థాయిలో జోక్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు టీడీపీకి చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రోహిత్ పవార్ పేర్కొన్నారు. ఈ సంబంధాలు వ్యాపార, రాజకీయ అనుబంధాలపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా జోక్యం చేసుకుని అజిత్ పవార్‌కు న్యాయం జరిగేలా చూడాలని రోహిత్ పవార్ కోరారు. కేసు విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోహిత్ పవార్ చేసిన ఈ ఆరోపణలతో విషయం రాజకీయంగా మరింత వేడెక్కింది. అయితే ఈ ఆరోపణలపై హెరిటేజ్ సంస్థ లేదా సంబంధిత వర్గాల నుంచి ఇంకా అధికారికంగా ఎటువంటి స్పందన రాలేదు. ఇక ఈ కేసు రాజకీయ ఆరోపణల దశను దాటి విచారణ దిశగా ఎలా ముందుకు సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. సంబంధిత సంస్థలు, దర్యాప్తు సంస్థలు తీసుకునే నిర్ణయాలు తదుపరి పరిణామాలను నిర్ణయించనున్నాయి.


