కలం, నల్లగొండ బ్యూరో : యూరియా ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ మునుగోడు (Munugode) నియోజకవర్గానికి చెందిన రైతు దామోదర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత మరింత దారుణంగా ఉంది. యూరియా (Urea) స్టాక్ పాయింట్లకు వస్తున్నప్పటికీ.. రైతులకు మాత్రం సక్రమంగా అందడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం యూరియా లేదని చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. యాప్‌పై అవగాహన లేని రైతులు, స్మార్ట్ ఫోన్లు లేని రైతాంగం మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా యూరియా అందక కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
తాజాగా మునుగోడు(Munugode) నియోజకవర్గానికి చెందిన రైతు దామోదర్ రెడ్డి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్ళలోంచి రక్తం కారుతోంది. ఒక్క సంచి బయటకు వెళ్లినా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం. మాకు చదువు రాదు. ఫోన్‌లో ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు. బుక్ చేసుకుంటనే యూరియా ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం.. నాకు చదువు రాదు ఎలా బుక్ చేసుకోవాలి. డబ్బులు తీసుకోని మీసేవలో యూరియా బుక్ చేస్తున్నారు. ఆఖరికి ఓటీపీ చెప్పేది కూడా తెలీదు.. అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.


