కలం, వెబ్ డెస్క్: కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ (AI ministry) ఏర్పాటు చేసి చట్టాలు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్(India AI Impact Summit)లో రేవంత్ రెడ్డి నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టడం ఎంతో ముఖ్యమని తెలిపారు. భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దేశంలో ఏఐ అభివృద్ధిని సమన్వయం చేయడానికి ప్రత్యేక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయగలమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, పరిశోధనకు ప్రాధాన్యతనిస్తూ ఒక ప్రత్యేక ఏఐ యూనివర్సిటీ స్థాపించాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఏఐ రంగంలో ముందంజలో ఉండాలంటే జీపీయూ చిప్‌ల తయారీతో పాటు మొత్తం సరఫరా సిస్టమ్‌లో భారత్ భాగస్వామి కావాలని రేవంత్ రెడ్డి అన్నారు. అవసరమైన అరుదైన ఖనిజాల సమీకరణపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్యను అంచనా వేసే వ్యవస్థను రూపొందించాలని, ఉద్యోగాలు కోల్పోయిన వారికి పునః నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. ఏఐ స్టార్టప్‌ల కోసం యువతకు నిధులు అందించాలని సూచించారు. తెలంగాణ దేశానికి ఏఐ స్టార్టప్ హబ్‌గా మారగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆరు నెలలకు ఒకసారి హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఏఐ సదస్సులు నిర్వహించాలని చెప్పారు.
జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్‌ల మాదిరిగా ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో ఏఐ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ కోరారు. సామాజిక న్యాయం సాధించడం, పేదరిక నిర్మూలనలో కూడా ఏఐని వినియోగించుకోవాలన్నారు. ఏఐ ప్రభావం అన్ని రంగాల్లో ఉందని, వ్యవసాయ రంగంలో కూడా ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ ఏఐ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.


