కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పాల్వంచ పట్టణానికి చెందిన ఓ మహిళ వితంతు పెన్షన్ కోసం ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తోంది. 2020లో రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన దొమ్మేటి పద్మ అనే నిరుపేద మహిళ పెన్షన్ కోసం ఓ పోరాటమే చేస్తోంది. పాల్వంచ మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకున్నా సరే ఆమెకు పెన్షన్ మంజూరు కావడం లేదు. భర్త మరణం తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో, పనికి వెళ్లే పరిస్థితి కూడా లేదని, దీంతో రోజు గడవడమే కష్టంగా మారిందని పద్మ కన్నీటి పర్యంతమవుతోంది.
పాల్వంచ పట్టణంలోని గాంధీ నగర్ 44వ డివిజన్లో పద్మ తన కూతురితో పాటు ఉంటుంది. కూతురు కూడా కూలీ పనులకు వెళ్తూ తల్లిని పోషిస్తోంది. కాబట్టి పెన్షన్ మంజూరు చేస్తే ఆ కుటుంబానికి కొంత ఆసరాగా ఉంటుందని స్థానికులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పెన్షన్ మంజూరు చేసి తమ ఐదేళ్ల నిరీక్షణకు ఒక పరిష్కార మార్గం చూపుతారని ఆ నిస్సహాయ మహిళలు ఎదురు చూస్తున్నారు.


