కలం, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఈ నియోజకవర్గంలో అనేక సంచలనాలు చోటు చేసుకున్నాయి. మొదట్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందిన డాక్టర్ తాటికొండ రాజయ్య ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో నాటి సీఎం కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కొద్ది రోజులకే ఆయన రెండు పదవులు కోల్పోవలసి వచ్చింది. అప్పటికే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరిని అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి వరించిది. నాటి నుంచి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి.
ఉల్టా పల్టా..!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. మొదటి నుంచి ఉప్పు నిప్పుగా ఉన్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకే పార్టీలో చేరారు. అయినప్పటికీ వారి మధ్య వైరం ఆగలేదు. ఇటీవల రాజకీయ పరిణామాలు గమనిస్తే రాజయ్య పై కడియం శ్రీహరి కి ఉన్న వైరం కాస్తా మాజీ సీఎం కేసీఆర్ వైపు మళ్లినట్లు చర్చ నడుస్తోంది. ఎప్పుడు రాజయ్యను టార్గెట్ చేసే కడియం కొంత కాలంగా కేసీఆర్ పై విరుచుకు పడుతున్నారు.
నిన్నటి రోజున ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ మీటింగ్ లో మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాజయ్య, కేసీఆర్ ను పదేపదే తెలంగాణ జాతిపిత అనడం పై ఆయన అగ్గి మీద గుగ్గిళం అయ్యారు. ఎవరికి నువ్వు జాతిపిత. తెలంగాణ నీ అయ్యా జాగీరా అంటూ పరుషంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం వ్యాఖ్యలను ఖండించారు. ‘నిన్ను పార్టీలో చేర్చుకుని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడమే కాకుండా నీ బిడ్డకు రాజకీయ భిక్ష పెట్టిన కేసీఆర్ విమర్శించే స్థాయి నీదా అంటూ మండిపడ్డారు. ఖాబర్ధార్ శ్రీహరి భవిష్యత్ లో నీకు బుద్ది చెప్పడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి జనగామ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
కేసీఆర్ ను టార్గెట్ చేసారా..?
మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలో చేర్చుకుని డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టడమే కాకుండా ఆయన కూతురికి సైతం రాజకీయంగా భవిష్యత్ ను ఇచ్చారు. గత సాధారణ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ను పక్కనబెట్టి కడియంకే స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండు స్థానాలు గెలుపొందగా అందులో స్టేషన్ ఘనపూర్ ఒకటి. కానీ పార్టీ అధికారం కోల్పోయేసరికి కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. నాటి నుంచి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. దీని పై రాజకీయ విశ్లేషకులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


