కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ (AI Summit) కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం జరిగిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్న ఆయన, మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) ఆధ్వర్యంలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. ఏపీలో సాంకేతిక విప్లవం, ఐటీ రంగంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన ముఖాముఖి చర్చలు జరుపుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఏఐ పాలసీపై ఆయన ప్రసంగం చేయనున్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అంతర్జాతీయ కంపెనీలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలను ఆయన ఈ వేదికపై వివరించనున్నారు.


