కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి మళ్లీ అధికారంలోకి వస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రుల సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు.
రెండేళ్ల కాంగ్రెస్(Congress) ప్రభుత్వ పని తీరుపై రెండు గంటల పాటు హైకమాండ్ సమీక్ష జరిపినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల్లో మెజారిటీ అమలు చేశామని, ఇంకా తమకు మూడేళ్ల సమయం ఉందని, మిగతా పథకాలు కూడా అమలు చేసి శభాష్ అనిపించుకుంటామని చెప్పారు. గత పాలకులు రూ.8 లక్షల కోట్లు అప్పుపెట్టి వెళ్లారని ఆరోపించారు. ఉన్న నిధులతో చాకచక్యంగా పథకాల అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర మంత్రి వర్గాన్ని హై కమాండ్ అభినందించిందని తెలిపారు. 80 శాతం ప్రజలు తమ పాలనతో సంతృప్తిగా ఉన్నారన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధివిధానాలపై రాహుల్ గాంధీ వివరాలు అడిగి తెలుసుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, మిగతా పంటలను కూడా ప్రోత్సహించాలని చెప్పారు. ఈ భేటీలో ప్రభుత్వం, పార్టీ పరంగా అన్ని అంశాలను చర్చించినట్లు తెలిపారు. భవిష్యత్తులో అనుసరించాల్సిన అంశాలపై పార్టీ పెద్దలు సూచనలు చేశారన్నారు. సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందని తెలిపారు. రాష్ట్ర మంత్రుల అభిప్రాయాలను కూడా చర్చించినట్లు తెలిపారు. అన్ని అంశాలపై హైకమాండ్ దిశా నిర్దేశం చేసిందన్నారు.
మార్చి మొదటి వారంలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు మహేష్ కుమార్ వెల్లడించారు. మార్చి 15 వరకు పార్టీ పదవులను భర్తీ చేస్తామన్నారు. అన్ని గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్నారు. కేసీఆర్‌లా హామీలు ఎగ్గొట్టమని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికలపై రెండు మూడు రోజుల్లో సీఎంతో పాటు తనను పిలిచి మాట్లాడుతామని చెప్పారన్నారు. మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అంశం చర్చకు వచ్చిందని, త్వరలోనే ఆయనతో హైకమాండ్ మాట్లాడుతుందని స్పష్టం చేశారు.


