కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసనసభ (AP Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. మరోవైపు మండలిలో ఇందాపూర్(Indapur), హెరిటేజ్(Heritage) సంబంధంపై వివాదం కొనసాగుతోంది. ఇందాపూర్ నెయ్యిపై వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ వరుసగా తిరస్కరిస్తూ వస్తున్నారు. దీనిపై వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) మాట్లాడుతూ వైసీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి అంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే వైసీపీ సభ్యులు ఆధారాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో వస్తే ప్రభుత్వం తరఫున సమాధానం చెప్తామన్నారు. బొత్స సత్యనారాయణకు నెయ్యికి, చీజ్‌కు తేడా తెలియడం లేదని విమర్శించారు. ఏ ప్రభుత్వంతో లావాదేవీలు చేయకూడదని హెరిటేజ్ ఒక నిబంధన పెట్టుకున్నదని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
మరోవైపు బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. హెరిటేజ్ వెబ్సైట్లోనే ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. సభలో ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపడుతున్నారు. మంత్రుల వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎంత భయం ఉందో అర్థం అవుతుందన్నారు.


