epaper
Wednesday, February 18, 2026
epaper

రిటైర్మెంట్ తర్వాత టెన్షన్ వద్దు.. నెలకు రూ.20,500 వచ్చే సూపర్ స్కీమ్!

క‌లం, వెబ్ డెస్క్‌: ప‌దవీ విరమణ (Retirement) అయ్యాక జీతం ఆగిపోతుంది.. కానీ కరెంట్ బిల్లు, మందులు, ఇంటి ఖర్చులు మాత్రం ఆగవు. ఇదే తాజా ఆందోళనగా మారుతున్న సమయంలో సీనియర్ సిటిజన్ల (Senior Citizens)కు నెలకు రూ.20 వేలకుపైగా స్థిర ఆదాయం ఇచ్చే ప్రభుత్వ పథకం ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తోంది. రిటైర్మెంట్ తర్వాత చాలామందికి ఆదాయం బాగా తగ్గిపోతుంది. కొందరికి పూర్తిగా లేకుండా పోతుంది. రోజువారీ ఖర్చులతో రిటైర్మెంట్ ఫండ్ కూడా త్వరగా అయిపోతోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS). ఈ పథకంలో బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా డబ్బు పెట్టి, ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ పొందవచ్చు. పూర్తి భద్రత ఉండటంతో పదవీ విరమణ చేసిన వారు దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

ఎస్‌సీఎస్ఎస్ అంటే ఏంటి?

ఇది ప్రభుత్వ మద్దతుతో నడిచే చిన్న ఆదాయ పథకం. 60 ఏళ్లు దాటిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. 55 నుంచి 60 ఏళ్ల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ లేదా సూపర్ అన్యువేషన్ తీసుకున్నవారు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. రక్షణ దళాల నుంచి రిటైర్ అయినవారు 50 ఏళ్ల తర్వాత కొన్ని షరతులతో ఖాతా తెరవొచ్చు. ఖాతాను ఒంటరిగా లేదా భార్యాభర్తలు కలిసి జాయింట్‌గా తెరవవచ్చు. పథకం కాలవ్యవధి 5 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత డబ్బు తీసుకోవచ్చు లేదా మరో 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.

ఎంత పెట్టుబడి పెట్టొచ్చు?

కనీసం రూ.1,000 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బును సురక్షితంగా పెట్టడానికి ఇది ఉపయోగపడుతోంది.

వడ్డీ రేటు ఎలా ఉంటుంది?

ప్రస్తుతం ఎస్‌సీఎస్ఎస్‌లో (SCSS) సంవత్సరానికి 8.2 శాతం వడ్డీ అందుతోంది. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో రేటును సమీక్షిస్తుంది. వడ్డీని ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరి నెలల్లో మొదటి పని రోజున ఖాతాలో జమ చేస్తారు.

నెలకు రూ.20 వేలకుపైగా ఎలా వస్తుంది?

ఈ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, ఏడాదికి సుమారు రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. దాన్ని నెలలుగా లెక్కిస్తే సగటున నెలకు దాదాపు రూ.20,500 ఆదాయం లభిస్తుంది. ఇలా ప్రతి నెల స్థిరంగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.

పన్ను లాభాలు కూడా ఉన్నాయి

ఎస్‌సీఎస్ఎస్ లో పెట్టిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ పొందవచ్చు. అయితే వడ్డీపై ఆదాయ పన్ను వర్తిస్తుంది. మొత్తం ఆదాయం పన్ను మినహాయింపు పరిమితికి తక్కువైతే వడ్డీపై పన్ను ఉండదు. ఏడాదికి వడ్డీ రూ.1 లక్ష దాటితే 10 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఆదాయం తక్కువ ఉంటే ఫారం 15హెచ్‌ ఇచ్చి టీడీఎస్ నివారించవచ్చు. టైర్మెంట్ తర్వాత కూడా నెలవారీ ఆదాయం కావాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఎస్‌సీఎస్ఎస్‌ ఒక భద్రమైన మార్గంగా కనిపిస్తోంది. తమ అవసరాలకు తగ్గట్టు పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

 Read Also: హామీ 42%.. గెలిచింది 62%.. ‘మున్సిపోల్స్’లో రిజర్వేషన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>