కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ (Congress) పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు రాష్ట్ర మంత్రులు సహా సీనియర్ నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. ముంబై వేదికగా జరిగే మూడు రోజుల సమ్మిట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే వెళ్ళిపోయారు. పార్టీ అధిష్టానంతో సమావేశం కారణంగా మంత్రులంతా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 19న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహల్‌గాంధీ (Rahul Gandhi) తదితరులతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. గత నెలలో మేడారం జాతర సందర్భంగా మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు క్యాబినెట్ సమావేశం కోసం హైదరాబాద్ విడిచిపెట్టి రెండు రోజుల పాటు వెళ్ళిపోయారు. ఇప్పుడు మంత్రులంతా పార్టీ సమావేశం కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. అధికారులే పరిపాలనా వ్యవహారాలను చూసుకోనున్నారు.
ఐఏఎస్‌ల అజమాయిషీలో సెక్రెటేరియట్ :
మున్సిపల్ ఎన్నికల హడావిడి కారణంగా గత రెండు వారాలుగా సచివాలయం బోసిపోయిందనే చర్చలు జోరుగానే సాగాయి. ఇప్పుడు మంత్రులంతా రెండు రోజులు ఢిల్లీకి వెళ్తుండడంతో ఇప్పటికీ సచివాలయంలో సందడి లేని వాతావరణమే కంటిన్యూ కానున్నది. ముఖ్యమంత్రి సహా మంత్రులంతా సచివాలయానికి దూరంగా ఉంటుండడంతో సెక్రెటేరియట్ మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ల అజమాయిషీలో కొనసాగనున్నది. ఒకవైపు వార్షిక బడ్జెట్ తయారీ కసరత్తు, మరోవైపు ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశం కోసం ఎజెండా తయారీ, సంబంధిత అంశాలపై సమగ్ర వివరాలతో కూడిన నివేదికల రూపకల్పనలో ఆఫీసర్లు నిమగ్నం కానున్నారు. సీఎం సహా మంత్రులు లేకుండా తెలంగాణ రాష్ట్రం అనాథగా మారనున్నదనే మాటలు సచివాలయ కారిడార్లలో వినిపిస్తున్నాయి.
పార్టీ సంస్థాగత అంశాలపై ఢిల్లీలో చర్చ :
అన్ని రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఆయా రాష్ట్రాల సీనియర్ నేతలతో పార్టీ హైకమాండ్ (Congress High Command) వరుస సమావేశాలు జరుపుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ లీడర్లతో ఫిబ్రవరి 19న మీటింగ్ కోసం షెడ్యూలు ఖరారైంది. రాష్ట్ర మంత్రులతో పాటు సీనియర్ నేతలు హాజరవుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తికావడం, ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, మున్సిపల్-పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెల్చుకోవడం, స్కీమ్‌ల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం, మెంబర్షిప్ డ్రైవ్.. ఇలాంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ చీఫ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి తదితరులంతా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
మూడు రోజులు సీఎం బిజీబిజీ :
ముంబై నగరంలో ఫిబ్రవరి 17 నుంచి మూడు రోజుల పాటు జరిగే ‘ముంబై క్లైమెట్ వీక్’లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రమే వెళ్లారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న సీఎం.. తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలన సంబంధిత అంశాల్లో రాష్ట్ర విజయాలను వివరించనున్నారు. అంతర్జాతీయ సదస్సు కావడంతో పలు దేశాల ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ గురించి, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి, విజన్ డాక్యుమెంట్లో పర్యావరణానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సైతం హాజరవుతున్నారు. తెలంగాణ విజన్‌కు తగినట్లు కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం గురించి వేదిక మీద నుంచే విజ్ఞప్తి చేసే అవకాశమున్నది. ముంబై ప్రోగ్రామ్ తర్వాత ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ప్రారంభోత్సవం కార్యక్రమం, కీ నోట్ అడ్రస్ ఈవెంట్లలో సీఎం పాల్గొంటున్నారు.
Read Also: జాతీయ రహదారుల వెంట ‘బీ కారిడార్లు’ : ఎన్హెచ్ఏఐ
Follow Us On: X(Twitter)


