కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కన్పించింది. మెజార్టీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. కానీ ఓ మున్సిపాలిటీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన వ్యక్తి ఓడిపోవడం రాజకీయవర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఆ మున్సిపాలిటీ మరేదో కాదు.. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వెన్‌రెడ్డి సంధ్యరాజును ప్రచారానికి ముందే ప్రకటించారు.
కానీ ఊహించని విధంగా 16వ వార్డులో చైర్మన్ అభ్యర్థి వెన్‌రెడ్డి సంధ్య (Venreddy Sandhya) ఓడిపోయారు. సీపీఎం నుంచి పోటీ చేసిన బత్తుల జయమ్మ కాంగ్రెస్ (Congress) చైర్మన్ అభ్యర్థిపై విజయం సాధించారు. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా సీపీఎం మొత్తం పేద కుటుంబానికి చెందిన జయమ్మ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ట్విస్ట్ ఇక్కడే ఉంది. వెన్‌రెడ్డి సంధ్యను కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించడంతో ఆమె ఎన్నికల ఖర్చుతో పాటు మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై దాదాపు రూ.7 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రధానంగా ఆమె పోటీ చేసిన వార్డుపైనే ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేసిందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంత భారీగా ఖర్చు చేసినప్పటికీ సంధ్య ఓడిపోవడం బ్యాడ్‌లక్ అంటూ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
అయితే సంధ్య భర్త వెన్‌రెడ్డి రాజు అంతకుముందు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. సంధ్య పోటీ చేసిన వార్డులో దాదాపు రూ.50 కోట్ల మేర అభివృద్ధి పనులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంత చేసినా సంధ్యరాజును కాదని.. సీపీఎం నుంచి పోటీ చేసిన బత్తుల జయమ్మను గెలిపించడం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అవుతోంది. ఇదిలావుంటే.. చౌటుప్పల్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, 13 స్థానాలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చేరో మూడు స్థానాలు గెలుచుకోగా, సీపీఎం ఒక స్థానంలో విజయం సాధించింది.
Read Also: కమిషన్లు, సీబీఐ, ఈడీ… అయినా సస్పెన్స్!
Follow Us On: Pinterest


