కలం, ఖమ్మం బ్యూరో : సింగరేణి నూతన సీఎండీ (Singareni CMD)గా జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన జిల్లా కలెక్టర్ గా, ఎన్నికల విభాగం, రవాణా శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి కీలక పదవుల్లో పనిచేశారు. వైద్య విద్యాభ్యాసం చేసిన అధికారి అయినప్పటికీ, పరిపాలనా సేవల్లో సమర్థుడి ఆయనకు గుర్తింపు పొందారు.
గత కొంతకాలంగా సింగరేణి సంస్థకు పూర్తిస్థాయి సీఎండీ లేకపోవడం వల్ల పరిపాలన, బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థకు పూర్తిస్థాయి సీఎండీని నియమించడం ద్వారా బొగ్గు ఉత్పత్తి, ఆర్థిక నిర్వహణ, సంస్థాగత నిర్ణయాల్లో స్పష్టత, స్థిరత్వం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
సింగరేణి ముందున్న సవాళ్లు..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కార్మికులు ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ బోర్డు ద్వారా అనారోగ్యంతో ఉన్న కార్మికులను అన్ ఫిట్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఆరోగ్యం సహకరించని ఉద్యోగులకు విశ్రాంతి దొరకడంతో పాటు, వారి వారసులకు ఉపాధి లభిస్తుంది.
సింగరేణి కార్మికులకు ప్రస్తుతం క్వార్టర్లు ఇస్తున్నారు. ఇవి ఉద్యోగ కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాదాపు నలభై ఏళ్ల పాటు సేవలు అందించిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత క్వార్టర్లు ఖాళీ చేసి అద్దె ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. అలా కాకుండా తమకు సొంత ఇల్లు కల్పించాలని కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.
గతంలో కొంతమంది ఉద్యోగులు ఇతరుల నుంచి ఉద్యోగాలను కొనుకున్నారు. అయితే రికార్డుల్లో పేర్లు మారకపోవడంతో అటువంటి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ మారు పేర్ల సమస్య పరిష్కారం కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. వీటితో పాటు చిన్న చిన్న పొరపాట్ల వల్ల డిస్మిస్ అయిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, ఇన్ కమ్ టాక్స్ మాఫీ చేయాలని కార్మికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇటీవల నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టెండర్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ టెండర్లను ఏ ప్రాతిపదికన పిలుస్తారు? సైట్ విజిట్ నిబంధనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది కూడా ప్రస్తుతం కీలక సవాలుగా మారింది.
సింగరేణి సంస్థలో ప్రతిరోజూ 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. అంటే దీని విలువ సుమారు 77 కోట్ల రూపాయలు. ఇందులో 44 వేల మంది శాశ్వత ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థకు సీఎండీని నియమించే విషయంలో ప్రభుత్వం భారీ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇన్ని సవాళ్లు, సమస్యలు ఉన్న సింగరేణిని కొత్త బాస్ (Singareni CMD) ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాల్సిందే.
Read Also: రాజ్యాంగ విరుద్ధంగా ‘సర్’ .. సీఈసీకి ఎంఎ బేబి లేఖ
Follow Us On: Sharechat


