కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడా.. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే అదే అన్పిస్తుంది. బిఅర్ఎస్ అధిష్ఠానం ఎంతో నమ్మకం పెట్టుకున్న సంగారెడ్డి (Sangareddy Municipality) , సదాశివపేట మున్సిపాలిటీ (Sadasivpet Municipality) లు కాంగ్రెస్ వశం కావడంతో తీవ్ర నిరాశకు గురిచేశాయి. అయితే ఓటమికి అధికార కాంగ్రెస్ పార్టీ బలంకంటే.. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యవహర శైలి, ప్రణాళిక లోపమే ప్రధాన కారణంగా కన్పిస్తున్నట్లు స్థానిక నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, 82,472 మంది ఓటర్లు ఉన్నారు. సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో 26 వార్డులు, 37,196 మంది ఓటర్లున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు మొత్తం 2,03,379 ఉండగా, ఈ రెండు మున్సిపాలిటీల్లోనే సగానికి పైగా 1,19,668 మంది ఓటర్లున్నారు. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో చైర్మన్లుగా తమవారే ఉంటే నియోజకవర్గం మీద పూర్తిస్ధాయిలో బలం ఉంటుదని చింతా ప్రభాకర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
అయితే తాజా ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లు, బిఅర్ఎస్ కు 10 సీట్లు వచ్చాయి. సదాశివపేట మున్సిపాలిటీలో మొత్తం 26 సీట్లు ఉంటే కాంగ్రెస్ కి 16, బిఅర్ఎస్ కి 8 సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సొంత మున్సిపాలిటీ సదాశివపేటలోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
ఒంటెద్దు పోకడలే దెబ్బ తీశాయా!
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలో బిఅర్ఎస్ ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశలు ఉన్నా.. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వ్యవహరశైలి వల్ల రెండు మున్సిపాలిటీలను కొల్పోయామని బిఅర్ఎస్ శ్రేణులు అనుకుంటున్నాయి. మున్సిపాలిటీల్లోని వార్డుల్లో బిఅర్ఎస్ తరుపున పోటిచేసే అభ్యర్థుల ఎంపిక సరిగా జరగలేదని చెబుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ, వార్డులలో బలం ఉన్న నాయకులకు కాకుండా ఎమ్మెల్యే తనకు నచ్చినవారికి టికెట్లు ఇచ్చారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలు సైతం చివరి వరకు బీ ఫాం ఇవ్వకుండా తిప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. చాలా మంది తాజా మాజీ కౌన్సిలర్లకు కూడా టికెట్లు ఇవ్వలేదు.. వారికి ఎందుకు టికెట్లు ఇవ్వలేకపోతున్నారో చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా పార్టీ కోసం నిజంగా కష్టపడి.. ప్రజా బలం ఉన్న నాయకులను ఇబ్బందుల గురిచేయడం ఫలితాలపై ప్రభావం చూపించాయని భావిస్తున్నారు.
రెబల్స్ దెబ్బ..
అభ్యర్ధుల ఎంపికలో ఏకపక్షంగా చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) తీసుకున్న నిర్ణయాలు బిఅర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అభ్యర్ధులను ప్రకటించకపోవడంతో పలు వార్డులలో బిఅర్ఎస్ తరుపున ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు వేశారు. బీఫాం సైతం మీకంటే మీకంటూ చెప్పుకుంటూ వచ్చి చివరి నిముషంలో గెలిచే సామర్ధ్యం ఉన్నవారికి కాకుండా, ఎమ్మెల్యే తనకు నచ్చిన వారికి బీఫాం ఇచ్చాడని కార్యకర్తలు చెబుతున్నారు. అందరికి అశ చూపి చివరి నిమిషం వరకు పార్టీ అభ్యర్ధి ఎవరు అనేది ప్రకటించక పోవడంతో.. అనివార్యంగా నామినేషన్ వేసినా వారు పోటీలోనే ఉన్నారు. బిఅర్ఎస్ నుంచి బీఫాం రాకపోవడంతో ఆ పార్టీ నుంచి కొందరు రెబల్స్ గా బరిలో దిగారు. ఇలా ఎమ్మెల్యే ప్రభాకర్ సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, టికెట్ ఆశావహులను బుజ్జగించకుండా అలసత్వం వహించడంతో సంగారెడ్డి, సదాశివపేట లో సుమారు 14 మంది బిఅర్ఎస్ రెబల్స్ పోటీలో నిలిచారు. చింతా ప్రభాకర్ టికెట్ల కేటాయింపులో చేసిన తప్పిదాలు.. ఫలితాల్లో స్పష్టంగా కనబడ్డాయి.
సంగారెడ్డి మున్సిపాలిటీ (Sangareddy Municipality) బాబానగర్ వార్డులో అశ్విన్ అనే కార్యకర్త ఖచ్చితంగా గెలుస్తాడని తెలిసినా.. అతన్ని కాదని మరోవ్యక్తి కి టికెట్ ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. కానీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసిన అశ్విన్ విజయం సాధించి చింతా ప్రభాకర్ నిర్ణయం సరైనది కాదని నిరూపించాడు. అలాగే 30 వార్డుకు చెందిన ఆంజనేయులు యాదవ్ కు గెలిచే అవకాశాలు ఉన్న బీఫాం ఇవ్వలేదు.. అతడు ఖచ్చితంగా గెలుస్తాడని ఇతర నాయకులు చెప్పినా వినకుండా , తన ముఖ్య అనుచరుడు తమ్ముడు మురళికి బిఫాం ఇచ్చాడు . ఫలితంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవక, ఇండిపెంట్ గా బరిలో ఉన్న రెబెల్ అంజనేయలు రెండవ స్దానం, బిఅర్ఎస్ అభ్యర్ధి మురళి మూడవ స్ధానంలో నిలిచాడు. ఇలా పలు వార్డులలో ప్రజ బలం లేనివారికి టికెట్ ఇచ్చి ఓటమికి కొని తెచ్చుకున్నారనే విమర్శలు లేకపోలేదు.
బిఅర్ఎస్ అభ్యర్ధులపై రెబల్స్ గా చింత ప్రభాకర్ అనుచరులు..
చింతాప్రభాకర్ సొంత మున్సిపాలిటీ సదాశివపేటలో జరిగిన పరిణామాలు, ఓటమికి గల కారణాలు మొత్తం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వైపుకే చూపిస్తున్నాయి. 26 వార్డు నుండి బిఅర్ఎస్ అభ్యర్ధిగా అపర్ణ శివరాజ్ పాటిల్ పోటి చేస్తే .. వారి మీద పోటిగా చింతా ప్రదాన అనుచరుడు నాగు (అలియాస్ నాగనాద్) భార్య ముద్ద శశికళ నాగనాధ్ ఇండిపెంట్ గా బరిలో ఉండటం సదాశివపేటలో పెద్ద చర్చకు దారితీసింది. గెలిస్తే చైర్ పర్సన్ గా పోటిలో ఉంటుదని బిఅర్ఎస్ అభ్యర్ధి అపర్ణ శివరాజ్ పాటిల్ ఓడించడానికే… తన అనుచరుడు శశికళ నాగును బరిలో ఉంచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా 10 వార్డులో సతలి శ్రీశైలం బిఅర్ఎస్ అభ్యర్ధిగా నిలబడగా ఆయనపై ఎమ్మెల్యే కూమరుడు చింత సాయి ప్రధాన అనుచరుడు ర్యాకల విరేశం ఇండిపెంట్ గా బరిలో నిలిచాడు.
ఇలా సొంత పార్టీ బిఅర్ఎస్ అభ్యర్ధుల పైననే చింతా ప్రభాకర్, అతని కొడుకు ప్రధాన అనుచరులు పోటీ చేయడం మున్సిపాలిటీ మీదనే నెగిటివ్ ప్రభావం చూపించిదని సొంత పార్టీ కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక 16 వార్డు లో చింతా ప్రభాకర్ సొంత తమ్ముడు చింతా గోపాల్ బిఅర్ఎస్ పార్టీ తరుపున పోటి చేస్తే .. మూడవ స్థానంలో నిలిచాడు. సదాశివపేట మున్సిపాలిటీలో ఇష్టరాజ్యంగా చింతా ప్రభాకర్ తీసుకున్న నిర్ణయాలతో బిఅర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే విమర్శలు లేకపోలేదు.
కోటరీ ప్రభావం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం జగ్గారెడ్డి (Jagga Reddy), అతని కుటుంబం మొత్తం డోర్ టూ డోర్ ప్రచారం చేసి ఓటర్లను కలిస్తే.. చింతా ప్రభాకర్ మాత్రం క్షేత్రస్ధాయిలో ప్రచారం చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే చుట్టూ చేరిన కోటరి ప్రభావంతో నిజంగా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, చెప్పుడు మాటలు విని క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతుందో అంచనా వేయలేకపోయడని చెబుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్ధులకు జగ్గారెడ్డి అన్ని రకాలుగా అండగా ఉంటే .. చింతా ప్రభాకర్ మాత్రం బిఅర్ఎస్ అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో అండగా నిలవలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫలితాలను ప్రభావం చేసే పోల్ మెనెమెంట్ లో కుడా సరిగా ప్లాన్ చేసుకోకపోవడం సంగారెడ్డి (Sangareddy Municipality) ,సదాశివపేట మున్సిపాలిటిల బీఆర్ఎస్ ఓటమికి కారణమంటున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ఆరోగ్యం సహకరించకపోయినా.. అయన గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. కానీ తమకు రాజకీయంగా అవకాశలు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించారని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను అసలు పట్టించుకోలేదని సంగారెడ్డి బిఅర్ఎస్ క్యాడర్ గుర్రుగా ఉంది.
Read Also: మున్సిపోల్స్: ఏ నాయకుడి పలుకుబడి ఎంత పనికొచ్చింది?
Follow Us On: X(Twitter)


