కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) స్పందించారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాయని మండిపడ్డారు. తాము ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. తమ మద్దతుతో పోటీ చేసిన వడ్డేపల్లి అభ్యర్థులు ప్రలోభాలకు గురయ్యారని విమర్శించారు. శనివారం ఆమె జాగృతి కార్యాలయంలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ హామీ అమలు చేయని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ముందంజలో నిలిచిందని.. తెలంగాణ తామే తెచ్చినం అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ అత్యంత దయనీయస్థితికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ ఒక్క కార్పొరేషన్‌కు పరిమితమితమైందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చివరకు తోక పార్టీ అయిన సీపీఐకి తోక పార్టీగా మారిపోయిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతిని ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ట్రోలర్స్‌పై స్పందిస్తూ ‘ఏ సిర్ఫ్ ట్రైలర్ హై.. పిక్చర్ బాకీ హై’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షం బలంగా లేకే..
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం బలంగా లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పుకొచ్చారు. తానే గతంలో మున్సిపల్ శాఖా మంత్రిగా ఉన్నానని.. తాను మున్సిపాలిటీలను ఎంతో అభివృద్ధి చేశానని కేటీఆర్ చెప్పుకున్నప్పటికీ ఆయనను ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఇంకో ఆరు నెలలు బోనస్’ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. ముందు సీఎం రైతులకు ఇవ్వాల్సిన బోనస్ ఇవ్వాలంటూ కవిత సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాలు కనిపిస్తున్నాయని.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే తాను సీఎం పదవినే లాక్కుంటానని రాజగోపాల్ రెడ్డి అంటున్నారని గుర్తు చేశారు. ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నదని కవిత (Kavitha) చెప్పుకొచ్చారు.
కార్యకర్తల ఒత్తిడి వల్లే పోటీ చేశాం
కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిడి వల్లే తాము ఈ ఎన్నికల్లో పోటీ చేశామని కవిత వ్యాఖ్యానించారు. త్వరలోనే రాజకీయ పార్టీ పెడతామని ఇప్పటికే ప్రకటించామని.. భవిష్యత్‌లో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కవిత పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి 40 స్థానాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలుపొందారని విమర్శించారు. ‘పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పడం లేదని కవిత పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కొన్ని స్థానాల్లో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని విమర్శించారు.
కూనంనేనికి ఎలా మద్దతు ఇస్తారు?
అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నో విమర్శలు చేశారని కవిత గుర్తు చేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేరుగా కేసీఆర్ నే కూనంనేని విమర్శించారని గుర్తు చేశారు. అటువంటి నేతతో, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటామని బీఆర్ఎస్ ఓపెన్ గా ప్రకటించడం.. వారి దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. తోక పార్టీ అయిన సీపీఐకి బీఆర్ఎస్ తోక పార్టీగా మారే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. సింగరేణి ఎన్నికల్లో కూడా జాగృతి పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.
భవిష్యత్‌లోనూ జాగృతితో కలిసి పనిచేస్తాం: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
భవిష్యత్‌లో తాము తెలంగాణ జాగృతితో కలిసి పనిచేస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ స్టేట్ కన్వీనర్ అంబటి జోజిరెడ్డి స్పష్టం చేశారు. జాగృతితో కలిసి పోటీ చేసిన తమ పార్టీ నేతలను చాలా మందిని ప్రజలు గెలిపించటం సంతోషంగా ఉందన్నారు. వడ్డేపల్లిలోనూ తాము ఉద్యమసంస్థ జాగృతితో కలిసి పనిచేశామన్నారు. ఈ విషయంలో మీడియా తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మెజార్టీ రాలేదని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలను బలవంతంగా చేర్చుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తమ పార్టీ వాళ్లను బెదిరించి కండువా కప్పారని మండిపడ్డారు.
తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులంతా తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో బీజేపీ లేదని.. అమిత్ షా, మోడీ పార్టీ ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ రూ. 30 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. తాము డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో పోటీ చేశామని చెప్పుకొచ్చారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. రామగుండం ఎమ్మెల్యే తమ వాళ్లపై గుండాయిజం, రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు.
గెలిచిన మా అభ్యర్థులకు కండువాలు కప్పి వాళ్ల పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారన్నారు. ‘జాగృతి తరపున 34 మంది పోటీ చేస్తే ఆరుగురు గెలిచారు. అదే బీఆర్ఎస్ నుంచి 60 మంది పోటీ చేస్తే 16 మంది మాత్రమే గెలిచారు. సీపీఐ మాత్రం ఒక్కో చోట ఒక్కొక్కరితో సంసారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. కార్మికుల విషయంలో వాళ్లు పొంతన లేని స్టేట్ మెంట్ చేస్తున్నారు.’ అంటూ ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఆర్ వీ ఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.


