కలం/ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. సీపీఐ ఎవరి మద్దతు తీసుకుంటుందన్న అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. కొత్తగూడెం మేయర్ పదవి (Kothagudem Mayor)పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. కొత్తగూడెం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 స్థానాలు ఉండగా ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, ఇతరులు 6, బీజేపీ 1, సీపీఎం 1 సీటు దక్కించుకున్నాయి. సీపీఐకి తాము మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం తాము సీపీఐ మిత్రపక్షమేనని చెప్పుకుంటున్నారు. మరి సీపీఐ బీఆర్ఎస్ మద్దతు తీసుకుంటుందా? కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటుందా? అన్నది వేచి చూడాలి. మేయర్ పదవి మేమే చేజిక్కించుకుంటామని కూనంనేని స్పష్టంగా చెబుతున్నారు. దీంతో ఈ కార్పొరేషన్ ఫలితం ఆసక్తికరంగా మారింది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌కు కలిపి 45సీట్లు వచ్చాయి కాబట్టి కొత్తగూడెంలో మేము ఓడినట్టు ఎలా అవుతుంది? అంటూ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇండిపెండెంట్లు కీలకం
మరో పక్క కొత్తగూడెంలో ఇండిపెండెంట్లు పాత్ర కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పటికే కొంత మంది ఇండిపెండెంట్లు సీపీఐకి సహకారం అందిస్తామని చెప్పినట్లు కూడా కూనంనేని తెలిపారు. అంటే ఒకవేళ స్వతంత్రులు ఆరుగురు సీపీఐకి మద్దతు తెలిపితే ఇంకా ముగ్గురు కార్పొరేటర్ల అవసరం పడుతుంది. 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును కాంగ్రెస్ వారు కిడ్నాప్ చేశారని రాంబాబు భార్య నాగమణితోపాటు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు వనమా వెంకటేశ్వరరావు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమిటన్న చర్చ కూడా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం ఆశిస్తుందా? అనే అనుమానాలు కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఎర్ర జెండా ఎటు వైపు ఉంటుందో మరి కాసేపట్లో తేలనుంది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించి పార్టీకి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


