కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 20,000 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలుతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వెలుపల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ హాళ్లలోకి కేవలం కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించారు. కౌంటింగ్ సిబ్బంది మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత బ్యాలెట్ బాక్సులను లెక్కించి, అనంతరం వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి తెరవనున్నారు. మొదటి ఫలితం వచ్చేందుకు దాదాపు రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక సాయంత్రం వరకు పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న ఎన్నికలు (Municipal Elections) జరిగాయి. మొత్తం 2569 వార్డుల్లో ఎన్నికలు జరుగగా, ఒక వార్డులో పోలింగ్ వాయిదా పడింది. మొత్తంగా 73 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Also: మేయర్లు, చైర్పర్సన్లపై భ్రమల్లేవ్ !.. ఓటింగ్ పర్సెంటేజ్పైనే బీఆర్ఎస్ ఫోకస్
Follow Us On: Youtube


