కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చాక ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యమకారులు బయట ఉండి బాధపడితే, తాను బీఆర్ఎస్‌లో ఉండి బాధపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేసీఆర్ (KCR) విమర్శించాలని లేదని, పదేళ్లు అవకాశం వస్తే ఏం చేశారని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
‘‘ గద్దర్ సహా చాలా మంది మేధావులు అప్పుడు తెలంగాణ కోసం పోరాడారు. 2001లో కేసీఆర్ వచ్చి తెలంగాణ ఉద్యమంలో అగ్గి రాజేశారు. మొత్తం సమాజం కూడా ఆయన వెంట ఉండి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. స్వరాష్ట్రంలో కొంత మంది ఉద్యమకారులకే అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చిన వాళ్లు ఉద్యమకారుల భుజాలు తడుతారని భావించాం. కానీ అవకాశం వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి వచ్చింది. మనవాడే మనల్ని పురుగుల్ని చూసినట్లు చూసి అవమానించాడు. ఇక ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచారో, మనల్ని ఉద్యమంలో కొట్టించారో వాళ్లే కేసీఆర్ చుట్టూ చేరారు. కేసీఆర్ అనాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. కానీ పదేళ్లు అవకాశం ఇస్తే ఎందుకు న్యాయం చేయలేదన్నది అడగాల్సిందే. కేశవరావ్ జాదవ్ చనిపోతే ఎందుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపలేదు‘‘ అని కవిత ప్రశ్నించారు.
‘‘కోదండరాం (Kodandaram), ఆకునూరి మురళి (Akunuri Murali) రేవంత్ రెడ్డితో కలవటంతోనే కాంగ్రెస్ (Congress)ను నమ్మారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడటం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చేదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. మనవాళ్లే గాయం చేయటంతో నొప్పి ఎక్కువగా ఉంది. ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేయాల్సి ఉంది. త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం. మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ. అహంకారం, సహనశీలత లేకపోవటంతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. మంచితనం, సహనశీలత, భోళాతనం తెలంగాణ తత్వం. అవి కోల్పోతే మనల్ని మనం కోల్పోయినట్లే. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డిని బయటికి గుంజుతరు. మనవాళ్లు కాదు. ధర్మం వైపు ఉండాలని శ్రీకృష్ణుడు చెప్పారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల వైపే ధర్మం ఉంది. వారి కోసం పోరాటం చేస్తాం” కవిత అన్నారు.
‘‘ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఫిబ్రవరి 12 న మనమంతా ఇలా చారిత్రక ప్రాంతమైన ఆర్టీసీ కళ్యాణ మండపంలో కలుసుకోవటం కొంత సిగ్గుగా, కొంత సంతోషంగా ఉంది. తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాదులు ఒక్కటైతే ఇదే చోట మనంతా తెలంగాణ జేఏసీగా ఏర్పాటయ్యాం. ఆ తర్వాత మనం తెలంగాణను సాధించుకున్నాం. కానీ మళ్లీ ఒకసారి ఉద్యమకారుల కోసం ఒక అడుగు ముందుకు వేసేందుకు ఇక్కడ కలుసుకున్నాం. నిజానికి రాష్ట్రం రాగానే ఉద్యమకారులందరికీ మొదటి వరుసలోనే గౌరవం, ఆర్థిక వృద్ధి, రాజకీయ అవకాశాలు వస్తాయని భావించాం.
కానీ ఆ విధంగా జరగకపోవటం చాలా బాధ కలిగించే అంశం. మన తెలంగాణ అనేది నిత్యం పోరాటాల గడ్డనే. మానవాళి పుట్టినప్పటికీ నుంచి మన గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణలో పుట్టినందుకు గర్వపడుతున్నా. ఎన్ని జన్మలు ఉన్న సరే మళ్లీ తెలంగాణలోనే పుట్టాలని కోరుకుంటున్నా. మన నేలకు పునీతమైన, పురాతనమైన చరిత్ర ఉంది” అని కవిత (Kavitha) గుర్తు చేశారు.
Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?
Follow Us On : WhatsApp


