ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీర్ నేత అని చెప్పుకోవడానికే భయమేస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అన్నారు. కొందరు చేసిన పనులకు కశ్మీర్ ప్రజలందరినీ బాధ్యులను చేయడం సరికాదని అన్నారు. ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీర్‌కు చెందిన వారంటేనే అంతా ఒకలా చూస్తున్నారని అన్నారు. ఉగ్రకుట్రలకు తమను ఎక్కడ బాధ్యులను చేస్తారేమో అనే భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా కశ్మీర్ ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన పేలుడుకు కశ్మీర్‌లోని కొందరు బాధ్యులు కావడం వల్ల మొత్తం కశ్మీర్ ప్రజలు అందులో భాగమనే భావనను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాని వల్లే ఢిల్లీకి వెళ్లినప్పుడు జమ్మూ కశ్మీర్ నెంబర్ ఉన్న కారును తీసుకెళ్లాలంటే తాను కూడా భయపడతానని అన్నారు.
ఎవరు ఎక్కడ వాహనాన్ని ఆపి, తనిఖీలు చేస్తారేమోనని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానని ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) అన్నారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ (J-K) రిజిస్ట్రేషన్ వాహనాన్ని దేశరాజధానిలో నడపడం కూడా నేరంగా పరిగణిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరూ మనల్సి అనుమానాస్పద దృష్టితో చూస్తున్నప్పుడు, వేరొకరు చేసిన పనికి మనల్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, కొద్దిమంది చేసే పనులకు అందరినీ బాధ్యులుగా చూస్తున్నప్పుడు మనం బయటకు వెళ్లడం కష్టంగా అనిపిస్తుందని తెలిపారు. అందువల్లే ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్ ప్రజలు తమ పిల్లలను బయటకు పంపడానికి ముందుకు రావట్లేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Read Also: అల్ ఫలా వర్సిటీ నుంచి 10 మంది మిస్సింగ్
Follow Us on: Youtube

