కలం, వెబ్ డెస్క్: చక్కగా చదువుకుంటూ స్నేహంగా ఉండాల్సిన విద్యార్థులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఏపీలో వెలుగుచూసిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుంటూరు (Guntur) జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ కాలేజీలో (Vadlamudi Vignan College) తోటి విద్యార్థులు రెచ్చిపోయారు. ఒక విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. కింద పడేసి కాళ్లతో తొక్కుతూ, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా కొట్టారు. విద్యార్థిపై అతి దారుణంగా దాడి జరుగుతున్నా.. తోటి విద్యార్థులు మొబైల్ ఫోన్లలో వీడియోలు తీయడం షాక్‌కు గురిచేస్తోంది.
ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు విద్యార్థి అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. తల, శరీర భాగాలపై బలమైన దెబ్బలు తగలడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే గమనించిన ఇతరులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం (Vadlamudi Vignan College), పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య నెలకొన్న పాత కక్షలే ఈ దాడికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. విద్యాసంస్థల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: మందుబాబులకు అలర్ట్… బాటిల్ చెక్ చేసుకోవాల్సిందే
Follow Us On: Pinterest


