కలం, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ ముగిసింది.. ఎగ్జిట్ పోల్ అంచనాలూ వెలువడ్డాయి.. ఇక కౌంటింగ్ కోసం పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఏ పార్టీ తరఫున ఎంతమంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికయ్యారో ఆ రోజు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ పోస్టులు, కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు ఏ పార్టీకి దక్కుతాయో క్లారిటీ వస్తుంది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 16న ఎన్నిక జరగనున్నందున అప్పటివరకూ కార్పొరేటర్లను, కౌన్సిలర్లను పదిలంగా కాపాడుకోవడం పార్టీల ముందున్న సవాలు. ప్రలోభాలకు గురికాకుండా, అవతలి పార్టీలోకి జంప్ కాకుండా చూసుకునేందుకు క్యాంపులు, రిసార్టులు, ట్రిప్‌ల (Camp Politics) పేరుతో తరలించడంపై ఇప్పటికే ఆలోచనలు మొదలయ్యాయి. హంగ్ తప్పదనుకునే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయి.
క్యాంప్ పాలిటిక్స్ (Camp Politics) లో అన్ని పార్టీలదీ అదే దారి :
గత ప్రభుత్వంలో 2020 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఎత్తుగడలే అమలయ్యాయి. నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా మరే పార్టీకంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు బీజేపీకి ఉన్నా మేయర్ స్థానం దక్కలేదు. మొత్తం 60 డివిజన్లు ఉన్న ఆ కార్పొరేషన్‌లో ఏ పార్టీకీ స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో మేయర్ ఎన్నిక కీలకంగా మారింది. అత్యధికంగా 28 మంది కార్పొరేటర్లు ఉన్న బీజేపీ మేయర్ స్థానం కోసం అన్ని ప్రయత్నాలూ చేసింది. బీఆర్ఎస్ ఎత్తుగడలను గమనించిన బీజేపీ.. తన కార్పొరేటర్లు చేజారకుండా గోవా ట్రిప్‌కు తీసుకెళ్ళింది. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకునేందుకు బీఆర్ఎస్ ప్రలోభాలకు తెర లేపింది. దీన్ని పసిగట్టిన బీఆర్ఎస్ తనదైన శైలిలో పావులు కదిపి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నది. ఆనాడు బీఆర్ఎస్ ఎత్తుగడలను ఈసారి ఏ పార్టీ అనుసరిస్తుందనేది ఆసక్తికరం. అదే మేయర్ ఎన్నికకు కీలకం.
ఆ మూడు రోజులూ కీలకం :
కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 13న పూర్తికానున్నది. ఏ పార్టీ బలమెంతో తేలిపోతుంది. మున్సిపాలిటీల చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్, కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 16న జరగనున్నది. హంగ్ వచ్చినచోట్ల మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన స్థాయిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూడగట్టుకోవడం పార్టీలకు సవాలులాంటిది. ఇందుకోసం ప్రలోభాల పర్వం తప్పకపోవచ్చు. దీని బారిన పడకుండా ఉండేందుకు క్యాంప్ పాలిటిక్స్ కూడా అనివార్యం కావచ్చు. మూడు రోజుల పాటు కౌన్సిలర్లు, కార్పొరేటర్లను చేజారకుండా చూసుకోవడం పార్టీలకు కత్తిమీద సాము లాంటిది. ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు ఖర్చు చేస్తే ఇప్పుడు వారిని కాపాడుకోడానికి పార్టీలు ఖర్చు చేయాల్సి రావచ్చు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రలోభాలకు పాల్పడితే అప్పటి ప్రతిపక్ష పార్టీలు గోవా లాంటి చోట్లకు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి భిన్నంగా బీఆర్ఎస్ క్యాంప్ పాలిటిక్స్ చేపట్టక తప్పని పరిస్థితులు ఏర్పడనున్నాయి.
నాడు నిజామాబాద్… నేడు ఎక్కడ? :
గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక అనేక మలుపులు తీసుకున్నది. అన్ని పార్టీలకంటే ఎక్కువ మంది కార్పొరేటర్లను గెలిపించుకున్న బీజేపీ మేయర్ పీఠాన్ని చేజార్చుకున్నది. కేవలం 13 మంది కార్పొరేటర్లే ఉన్న బీఆర్ఎస్ ఆ పోస్టును చేజిక్కించుకున్నది. ఇందుకు మజ్లిస్ తరఫున గెలిచిన 16 మంది మద్దతు తీసుకున్నది. దీనికి తోడు ఒక స్వతంత్ర అభ్యర్థి, ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లను లాక్కున్నది. ఎలాగూ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఓట్లతో మొత్తం బలం 38కు చేరుకుంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మేయర్ అయ్యారు. ఎక్కువ స్థానాలు గెలుచుకున్నా బీఆర్ఎస్ నిస్సహాయురాలిగా మిగిలిపోయింది. ఈసారి ఇలాంటి సీన్ ఎక్కడ రిపీట్ అవుతుందన్నది కౌంటింగ్ రోజున తెలుస్తుంది. ప్రలోభపెట్టేదెవరు.. క్యాంపులకు తరలించేది ఎవరు?.. పదిలంగా ఉండేదెవరు?.. పార్టీ మారేది ఎవరు?.. మూడు రోజుల పాటు ఈ డ్రామా కొనసాగనున్నది.
Read Also: కరీంనగర్‌లో ‘పొత్తు’ పొడుపు – కమలం, గులాబీ స్నేహం ?
Follow Us On: Sharechat


