epaper
Wednesday, February 18, 2026
epaper

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల​కు ఎలాంటి లోటుపాట్లూ లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను నిజామాబాద్​ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Ila Tripathi) ఆదేశించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కోసం ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ను ఆమె సోమవారం సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులూ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సిబ్బందికి పోలింగ్ సామగ్రిని పక్కాగా అందించాలన్నారు. చెక్ లిస్ట్​ ఆధారంగా సామగ్రి అందిందా, లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు.

సకాలంలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని ఆమె (Ila Tripathi) ఆదేశించారు. పోలింగ్ సామగ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా పోలీసు బందోబస్తు ఉండాలని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తన దృష్టికి తేవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాళ్ళను సైతం పరిశీలించిన కలెక్టర్.. సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని, ఒక్క సెకను కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నాని ఆమె అన్నారు. సకాలంలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు ర్యాంపులు, వీల్ చైర్లు అందుబాటులో ఉండాలన్నారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు సమాచార వివరాలతో కూడిన స్లిప్పులను వంద శాతం పంపిణీ చేసేలా చూడాలని చెప్పారు.

అనంతరం కలెక్టర్ మామిడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సదుపాయాల గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనవసర తప్పిదాలకు తావిస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలోని మూడవ తరగతి గదిని కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు ఆంగ్లం సబ్జెక్టుపై కొద్దిసేపు బోధించారు. పలు ప్రశ్నలు అడిగారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లను చిన్నారులకు పంచిపెట్టారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్​​ మాల్వియా, స్థానిక అధికారులు ఉన్నారు.

Read Also: తెలంగాణ రాజకీయాలను మునుగోడు నుంచే శాసిస్తా : రాజగోపాల్ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>