epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం తిరిగి ఇచ్చేది 42 పైసలే : సీఎం రేవంత్

కలం, డెస్క్ : తెలంగాణకు కేంద్రం నుంచి లక్షల కోట్ల నిధులు వస్తున్నాయని బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఖండించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే.. అందులో కేవలం 42 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని తెలిపారు. ప్లానింగ్ కమిషన్ రూల్స్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి 42 శాతం నిధులు ఇవ్వాలని రూల్ ఉంది కాబట్టే ఇస్తున్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. యూపీ రూపాయి ఇస్తే రెండు రూపాయలు కేంద్రం నుంచి వెళ్తున్నాయని.. బీహార్ విషయంలోనూ అదే జరుగుతుందని సీఎం రేవంత్ చెప్పారు.

బీజేపీ తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వట్లేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హామీ ఇచ్చారు. 12 ఏళ్లలో ప్రధాని మోడీ దాన్ని నెరవేర్చలేదు. మొన్న మహబూబ్ నగర్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి హామీ ఇస్తారేమో అనుకుంటే.. చేయలేదు. అదే విధంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదిలాబాద్ లో ప్రచారానికి వచ్చారు. కొన్ని దశాబ్దాలుగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడానికి మహారాష్ట్ర సహకరిస్తుందని హామీ ఇస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన ఇవ్వకపోగా.. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు భూములి ఇస్తే దానికి నష్టపరిహారం కూడా ఇవ్వలేదని మనల్ని అవమానించారు’ అంటూ సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

గత జీహెచ్ ఎంసీ (GHMC) ఎన్నికల్లో వరద బాధితులకు నష్టపరిహారం ఇస్తామని.. బైక్ పోతే బైక్, ఏ వస్తువు పోతే ఆ వస్తువును ఇప్పిస్తామని బండి సంజయ్, కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం నుంచి రూ.10వేల కోట్లు నిధులు తీసుకొస్తామని బీజేపీ జీహెచ్ ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని రేవంత్ తెలిపారు. ‘వాళ్ల హామీలు నమ్మిన ఓటర్లు 50 మంది బీజేపీ కార్పొరేటర్లను గెలిపించారు. ఎన్నికలు అయిపోయాక అడిగితే.. మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా.. దాని గురించే మేం చెప్పాం అని బండి సంజయ్ (Bandi Sanjay) మాట తప్పాడు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని దొంగ హామీలు ఇస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మితే మనల్ని మనం అవమానించుకున్నట్టే’ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: బీఆర్ఎస్ పని అయిపోయింది.. కాంగ్రెస్‌ను ఖతం చేయాలి : కిషన్‌రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>