కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది. శ్రీశైలంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పేర్కొన్నారు. శ్రీశైలం క్షేత్రంలో శివరాత్రి దగ్గర పడుతుండటం, సోమవారం కావడంతో భారీ రద్దీ ఉంది. భక్తులు దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. వేకువజాము నుంచే శివస్వాములు భారీ సంఖ్యలో వచ్చారు. తాగునీరు, విశ్రాంతి, శౌచాలయాల వంటి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కొన్ని క్యూలైన్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆగ్రహించిన శివస్వాములు క్యూలైన్ల గేట్ల తాళాలను పగలగొట్టి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బారికేడ్లను ధ్వంసం చేశారు. ‘ఓం నమ: శివాయ‘, ‘న్యాయం చేయాలి’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికార యంత్రాంగంపై ఆగ్రహం
దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని భక్తులు మండిపడ్డారు. భారీగా భక్తులు వస్తారని ముందే తెలిసినా, క్యూలైన్ల నిర్వహణ, వాలంటీర్ల నియామకం, తాగునీరు, మెడికల్ సపోర్ట్ వంటి అంశాలపై సరైన శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శనం క్యూలైన్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని శివస్వాములు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. క్యూలైన్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని, దర్శనాన్ని వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో క్రమంగా ఉద్రిక్తత తగ్గింది. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, భక్తుల సంఖ్యకు తగిన విధంగా శాశ్వత ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని శివస్వాములు కోరుతున్నారు. రద్దీ రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని, భక్తుల ఇబ్బందులు తొలగించేలా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


