కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టేందుకు.. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నేడు మంత్రులు, సెక్రటరీలతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–2047 (Swarnandhra 2047) విజన్, అలాగే పది సూత్రాల అమలుపై విస్తృతంగా చర్చ జరగనుంది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాఖలు సాధించాల్సిన లక్ష్యాలు, ప్రణాళికల అమలు వంటి వ్యూహాలపై సీఎం చంద్రబాబు (Chandrababu) స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తూ, ఫలితాల ఆధారిత పాలనపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కీలక సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొననున్నారు. జిల్లా స్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలు, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై సీఎం ప్రత్యక్షంగా సమీక్ష చేయనున్నారు.


