కలం, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లో అధికార, ప్రతిపక్షాల ఓ కార్టూన్ చిచ్చు పెట్టింది. ఈ వివాదంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని వాడుకోవడంపై కర్ణాటక గాంధీ స్మారక నిధి (KGSN) ఖండించింది. కాగా, ఈ వ్యవహారానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కేంద్ర బిందువు కావడం గమనార్హం. అసలేమైందంటే..
కర్ణాటకలోని అన్ని ప్రముఖ కన్నడ, ఆంగ్ల దినపత్రికల మొదటి పేజీలో ఈ నెల 3న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. అందులో తెల్లచొక్కా, ఖాకీ నిక్కరు వేసుకున్న ‘సంఘ్–అప్పా’ను చేతిలో బెత్తంతో గాంధీజీ మందలిస్తున్నట్లు చూపించారు. ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు. అలాగే, MGNREGA పేరుకు బదులు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) (VB G RAM G) పెట్టడంపై కూడా విమర్శించారు.
ఈ కార్టూన్ చూసి కర్ణాటక బీజేపీ భగ్గుమంది. ప్రతిగా ఫిబ్రవరి 7న అన్ని దినపత్రికల్లో ఒక పూర్తి పేజీ ప్రకటన ఇచ్చింది. అందులో ఒక కార్టూన్ ఉంది. గాంధీజీ కర్ర ఎత్తి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కొట్టబోతున్నట్లు ఉంది. వాళ్లను ‘నుంగప్ప’(అన్నీ వృథా చేసే వ్యక్తి) అని అంటూ గాంధీజీ మాట్లాడుతున్నట్లు ఆ కార్టూన్ ఉంది. ‘మహాత్ముని సొంత ఆస్తిలా వాడుకుంటున్న నువ్వు నుంగప్ప’ అని గాంధీజీ అన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
దీంతో ఈ కార్టూన్ ప్రకటనలు అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదం రాజేశాయి. ‘సంగప్ప–నుంగప్ప’ అంటూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ క్రమంలో కార్టూన్లో మహాత్మా గాంధీ చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై కర్ణాటక గాంధీ స్మారక నిధి మండిపడింది (Karnataka). ఇది జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అవమానకరమని, దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గాంధీజీ చిత్రాన్ని రాజకీయ లాభాల కోసం, పార్టీ అవసరాల కోసం వాడుకోవడం ఇటీవల కాలంలో ఆందోళనకర ధోరణిగా మారిందని వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా ‘మహాత్మ’ అనే గౌరవ బిరుదుతో పూజించబడే వ్యక్తిని ఈ విధంగా అవమానకరంగా చూపించడం యువతకు తప్పు సందేశం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేజీఎస్ఎన్ అధ్యక్షుడు వుడే పి. కృష్ణ, గౌరవ కార్యదర్శి ఎం.సి. నరేంద్ర సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంలో మీడియా సైతం తన బాధ్యతను గుర్తించాలని ఆ ప్రకటనలో వాళ్లు కోరారు. ఇలాంటి యాడ్స్‌ను ప్రచురించవద్దని కోరారు.
Read Also: నా బైక్ కు చలాన్ ఎలా వేస్తారు.. రోడ్డుపై యువకుడి నిరసన
Follow Us On : WhatsApp


