కలం, నల్లగొండ బ్యూరో : మా అభ్యర్థులు నల్లగొండలో (Nalgonda) డబ్బులు పంచబోరని, ప్రజల సమస్యల కోసం పనిచేస్తారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) తెలిపారు. ఆదివారం నల్లగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 35, 39 వార్డుల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా చేనేత, బీసీ వర్గాల బతుకుల్లో మార్పు లేదన్నారు. చేనేత, బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ ఖర్చుపై కాగ్ లెక్కలతో ప్రశ్నించారు.
కేటాయింపులు జరిగితే డబ్బు ఎక్కడ ఖర్చైంది? బాధ్యత ఎవరిది? అని నిలదీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లల బాత్రూములు, శానిటేషన్ కోసం నిధుల కేటాయిస్తే 80 శాతం దోచుకు తిన్నారని ఆరోపించారు. ఓటు అంటే రూ.వెయ్యి కాదని, జీవితం, పిల్లల భవిష్యత్తు అని చెప్పారు. డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసే రాజకీయ సంస్కృతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మా నగర్ కాలనీ, పద్మశాలి, బీసీ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతానని ప్రకటించారు.
సంవత్సరాలుగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో పేద ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. బీసీల రాజకీయ హక్కులు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడిందని, మున్సిపాలిటీలో తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించే పాలన తీసుకువస్తామని మల్లన్న (Teenmaar Mallanna) పేర్కొన్నారు. టీఆర్పీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యే ఉండే రాజకీయాన్ని తీసుకువస్తామని, రాబోయే ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
Read Also: కాంగ్రెస్ కు ఓటేస్తే పన్నులు పెంచుతారు : బండి సంజయ్
Follow Us On : WhatsApp


