కలం, మెదక్ బ్యూరో : బిఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)కు నిరసన సెగ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజల నిరసనలతో హోరెత్తింది. హరీష్ రావుకు వ్యతిరేకంగా పెద్దయెత్తున ప్రజలు రావడం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హరీష్ రావు ప్రచారం చేయకుండా వెనుదిరిగారు. షెడ్యూల్ ప్రకారం ప్రచార సభ ఉన్నా స్థానికుల తీవ్ర నిరసనలతో ప్రచారాన్ని రద్దు చేసుకొని వెళ్లిపోయారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆరెస్ నేతలను మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ (Mallanna Sagar Project) ముంపు బాధితులు ఉండే ఆర్ అండ్ ఆర్ కాలనీ ప్రచారం కోసం వెళ్లవలసి ఉంది. అయితే హరీష్ రావు ప్రచారం కోసం వస్తున్నాడని తెలిసి పెద్దయెత్తున మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలు.. సభ జరిగే ప్రాంతం, ప్రచార రథం ముందు చేరుకొని కేసీఆర్, హరీష్ రావు (Harish Rao)లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం తమ ఊర్లు, భూములు బలవంతంగా లాక్కొని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు తీసుకునే సమయంలో ప్యాకేజీ, ఉపాధి అంటూ హామీలు గుప్పించి, తర్వాత చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. దీంతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలకు, బిఆర్ఎస్ క్యాడర్ మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీ ఎత్తున పోలీసులు చేరుకొని రెండు వర్గాల వారిని చెదరగొట్టారు.
Read Also: బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ: కవిత సంచలన ఆరోపణ
Follow Us On: Instagram


