కలం, తెలంగాణ బ్యూరో : ఎప్పుడూ సందర్శకులతో, సిబ్బందితో హడావిడిగా కనిపించే సచివాలయం ఇప్పుడు సందడిలేకుండా మారిపోయింది. వర్కింగ్ డే అయినా శుక్రవారం ఆరు అంతస్తుల్లోని ఛాంబర్లు బోసిపోయాయి. మంత్రులంతా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. కొద్దిమంది ఆఫీసర్లు ఎలక్షన్ డ్యూటీలో అబ్జర్వర్లుగా వెళ్లిపోయారు. మరో ఇరవై మంది వరకూ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ట్రెయినింగ్ డ్యూటీ కోసం ఢిల్లీ వెళ్ళారు. పరిపాలనా కేంద్రంగా ఉండే సచివాలయం మొక్కుబడి స్టాఫ్‌తో నడుస్తున్నది. మరో నాలుగైదు రోజుల వరకూ ఇదే తరహా వాతావరణం అనే మాటలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ఆఫీసర్లే లేనప్పుడు పనులు కావడం అనుమానం. అందుకే సందర్శకులు సైతం లోపలిదాకా వెళ్ళకముందే విషయం తెలిసి వారి పనులను వాయిదా వేసుకుంటున్నారు.
మంత్రుల గైర్హాజరుతో స్టాఫ్‌లో నిర్లక్ష్యం :
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంత్రులకు పార్లమెంటు నియోజకవర్గాలవారీగా బాధ్యతలు అప్పజెప్పింది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. మరోవైపు వారు ఇన్‌చార్జిలుగా ఉన్న జిల్లాల్లోనూ ప్రచార సరళిని తెలుసుకుంటూ తగిన పర్యవేక్షణ తప్పనిసరి అయింది. మంత్రులే సచివాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఆయా శాఖల అధికారులు సైతం తూతూ మంత్రంగానే విధులకు హాజరవుతున్నారు. మామూలు రోజుల్లోనే మధ్యాహ్నం భోజన విరామం తర్వాత గంట సేపు వాకింగ్ పేరుతో కారిడార్లలో తిరుగుతున్నారంటూ ఉద్యోగులపై, ఆఫీసర్లపై ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు పట్టించుకునేవారు, అడిగేవారు లేకపోవడంతో చాలా పేషీల్లో, ఛాంబర్లలో సిబ్బంది హాజరు అంతంతమాత్రంగానే తయారైంది. నిత్యం ఫైళ్ళ ట్రాన్సాక్షన్లలో మునిగిపోయే సిబ్బంది శుక్రవారం పల్చగానే కనిపించారు. మంత్రులే లేనప్పుడు ఇక అధికారులు, సిబ్బందిని అడిగేదెవరనేది జనరల్ డిస్కషన్.
క్యాంపెయిన్ పూర్తయ్యేంత వరకూ ఇదే పరిస్థితి :
మున్సిపల్ ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. అప్పటివరకూ మంత్రులంతా క్యాంపెయిన్‌లోనూ ఉండిపోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎలక్షన్ డ్యూటీలో ఉన్న కొందరు ఆఫీసర్లు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఫలితాలు వెల్లడించంత వరకు బిజీగానే ఉంటారు. ప్రచార పర్వం ముగిసిన తర్వాత ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివిధ శాఖల మంత్రులు, అధికారులతో రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించేలా ముసాయిదా షెడ్యూలు ఖరారైంది. మున్సిపల్ ప్రచారం నుంచి మంత్రులు రిటన్ అయిన తర్వాతనే సచివాలయంలో మళ్ళీ సందడి షురూ కానున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం వారివారి నియోజకవర్గాల పనుల అవసరాల కోసం సచివాలయానికి ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. వారంతా ఎన్నికల ప్రచారంలోనే మునిగిపోయారు. మంత్రులే లేనప్పుడు, వారిని కలిసే అవకాశమే లేనప్పుడు ఎవరైనా ఎందుకొస్తారనే మాటలు సెక్రెటేరియట్ స్టాఫ్ నుంచి వినిపిస్తున్నాయి.
Read Also: U19 వరల్డ్ కప్: ఆరోసారి విశ్వవిజేతగా ‘యువ’భారత్!
Follow Us On : WhatsApp


