కలం, స్పోర్ట్స్ : ఏకంగా ఆరోసారి అండర్-19 వరల్డ్ కప్ (U19 World Cup) ను భారత్ కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో భారత యువజట్టు చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌తో జరిగిన తుది పోరులో 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి, ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ (175) సృష్టించిన విధ్వంసానికి ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేయగా, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్‌కు కప్పును అందించారు.
వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం అందించాడు. కేవలం 80 బంతుల్లోనే 15 ఫోర్లు, 15 సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆయుష్ మాత్రే (53), వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిగ్యాన్ కుందు (40), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) కూడా రాణించారు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు చేసింది. అండర్-19 ప్రపంచకప్ (U19 World Cup) ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోరు కావడం విశేషం.
పోరాడి ఓడిన ఇంగ్లండ్
412 పరుగుల భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కాలెబ్ ఫాల్కనర్ (115) అద్భుత సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. కానీ తమ జట్టును గెలిపించలేకపోయాడు. బెన్ డాకిన్స్ (66) కూడా రాణించాడు. మిగతా బ్యాటర్లలో బెన్ మేయస్ (45), కెప్టెన్ థామస్ ర్యూ (31), జేమ్స్ మింటో (28), జోసెఫ్ మూర్స్ (17) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. వారు కూడా ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. చివరకు ఇంగ్లండ్ జట్టు 311 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. సూపర్ సెంచరీతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.


