కలం, వెబ్ డెస్క్: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసిన బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఏమిటని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ప్రశ్నించారు. బుట్టెంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ బీ ఫామ్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తోందని కవిత వెల్లడించారు. బీసీల కోసం రాజకీయంగా, విద్యా పరంగా సముచితమైన రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి గత రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. ఈ పోరాటంలో భాగంగా అసెంబ్లీలో బిల్లు పెట్టించడంలో కానీ, ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వం వెంటపడి ముందుకు వెళ్లడంలో తెలంగాణ జాగృతి అన్ని బీసీ సంఘాలతో కలిసి పోరాడిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వం ఓ జీవోను తీసుకొచ్చిందని తెలిపారు. ఆ జీవోను ఆపేందుకు ఇద్దరు పిటిషనర్లు కీలక పాత్ర పోషించారన్నారు. అందులో బుట్టెంగారి మాధవరెడ్డి ఒకరని తెలిపారు. ఇప్పుడు ఆయనకు బీఆర్ఎస్ పార్టీ బాజాప్తా మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడమంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ఆ కేసు వేయించిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు వ్యతిరేకమా అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుందా అనే విషయాన్ని స్పష్టం చేయాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేశారు.
12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ:
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఈ సభ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరగనుంది. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని చాటే విధంగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి.


