కలం, వెబ్ డెస్క్: జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్(Prashant Kishor)పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారా? అని మండిపడింది. గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో అధికార జేడీయూ–బీజేపీ కూటమి నిబంధనలు ఉల్లంఘించిందని ప్రశాంత్ కిశోర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి ఒక మహిళకు రూ.10,000 చొప్పున పంపిణీ చేయడం స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని వాదించారు.
ఆ పదివేలు ప్రభావం చూపించాయి
ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వం 25–35 లక్షల మంది మహిళా ఓటర్లకు ప్రయోజనాలు కల్పించిందని, ఇది అవినీతిపరమైన చర్యల కిందికి వస్తుందని జన్ సురాజ్ ఆరోపించింది. మహిళలకు ఇచ్చిన రూ.10,000 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని ఆయన చెప్పారు. ఈ చర్య వల్ల నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 స్థానాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలని ఆయన కోరారు. అయితే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) కు సూచించింది.
పిటిషన్‌కు విచారణార్హత లేదు
ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొన్నారు. ఎన్నికల హామీలు, ఉచితాల అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ పెండింగ్‌లో ఉంది. రాజకీయ పార్టీల ఆకర్షణీయ హామీలు రాష్ట్రాలను ఆర్థిక సంక్షోభం వైపు నెట్టే ప్రమాదం ఉందని కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించింది. అయితే ఈ కేసులో రాజకీయ పార్టీ తరఫున కాకుండా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని దాఖలయ్యే పిటిషన్లను మాత్రమే విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల్లో ఓడిన ప్రశాంత్ కిశోర్
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి, 238 స్థానాల్లో పోటీచేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ప్రారంభంలో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉన్న జన్ సురాజ్ క్రమంగా వెనకబడింది. చివరకు ఒక్క సీటు కూడా గెలవక, నాలుగు శాతం కంటే తక్కువ ఓటు షేర్‌కే పరిమితమైంది.


