కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి, తెలంగాణపై విమర్శలు చేసిన పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు చెందిన జనసేన పార్టీతో భారతీయ జనతా పార్టీ(BJP) ఎలా పొత్తు పెట్టుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటును వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ల కళ్ల దిష్టితో ఎండిపోయాయని పవన్ అన్నారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తెలంగాణలో అభ్యర్థులను పెడుతూ బీజేపీతో పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనన్నారు. బీజేపీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి పెట్టకపోవడంపై జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు విఫలం అయ్యారని విమర్శించారు.


