కలం, వెబ్ డెస్క్ : పంచాయతీ రాజ్ విభాగంలో సూపరింటెండెంట్ ఇంజినీర్ గా పనిచేసి, నెల రోజుల క్రితమే పదవీ విరమణ చేసిన కల్లెపల్లి శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు భారీ సోదాలు (ACB Raids) నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో విశాఖపట్నం, సాలూరు, హైదరాబాద్‌లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు.
ఈ సోదాల్లో శ్రీనివాసరావుకు విశాఖపట్నం (Vizag), ఇతర ప్రాంతాల్లో మూడు ఖరీదైన ఇంటి స్థలాలు, రెండు నివాస ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుమారు 18.57 ఎకరాల భారీ వ్యవసాయ భూమిని ఆయన అక్రమంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. సోదాల (ACB Raids) సమయంలో ఇంట్లో భారీగా నగదు మరియు బంగారం లభ్యమైంది. సుమారు 61.87 లక్షల రూపాయల నగదుతో పాటు 2.5 కిలోల బంగారం, ఏకంగా 20.3 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు హ్యుందాయ్ యాక్సెంట్ కారు, ఒక మోటార్ సైకిల్, విలాసవంతమైన గృహోపకరణాలను సీజ్ చేశారు. అంతేకాకుండా ఆయన పేరిట ఉన్న ఐదు బ్యాంకు లాకర్లను కూడా అధికారులు గుర్తించారని, వాటిని రేపు తెరిచి తనిఖీ చేయనున్నారని సమాచారం.
శ్రీనివాసరావు 1990లో పంచాయతీ రాజ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా నియమించబడ్డారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సుదీర్ఘ కాలం పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ నుండి సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు. సుమారు 35 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్న ఆయన, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను వెనకేసినట్లు ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Read Also: అయ్యో పాపం.. గుండె జబ్బుతో తల్లి, వింత జబ్బుతో కుమారుడు
Follow Us On: Youtube


