కలం, వెబ్ డెస్క్ : ముంబై (Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు విమానాలకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో ఉన్న ఎయిరిండియా (Air India), ఇండిగో (IndiGo) విమానాల రెక్కల కొనలు రన్‌వేపై ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై నుంచి కోయంబత్తూర్‌కు బయలుదేరాల్సిన ఎయిరిండియా ఎయిర్‌బస్ A320 (ఫ్లైట్ AI2732 – VT-TYF) రన్‌వేపై నిలిపి ఉండగా, హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న ఇండిగో ఎయిర్‌బస్ A320 (ఫ్లైట్ 6E791 – VT-IFV) ల్యాండింగ్ అనంతరం టాక్సింగ్ మార్గంలో ముందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
టాక్సింగ్ సమయంలో రెండు విమానాల రెక్కల కొనలు స్వల్పంగా ఢీకొనడంతో, రెండు విమానాలకు తక్కువ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానాల్లో ఉన్న ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై విమానాశ్రయ అధికారులు వెంటనే స్పందించి, రెండు విమానాల కదలికలను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలపై డీజీసీఏ (DGCA)తో పాటు సంబంధిత అధికారులు విచారణ ప్రారంభించారు.


