కలం, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఆరేళ్లలో 7,400 మంది నక్సల్స్‌ను అరెస్టు (Naxals Arrested) చేసినట్లు కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Nityanand Rai) తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం లేకుండా చేసేందుకు కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకొంటోందని ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదం బాగా తగ్గినట్లు మంత్రి చెప్పారు. 2019 నుంచి 2025 డిసెంబర్ వరకు అంటే ఆరేళ్లలో 7,400 మంది నక్సల్స్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అదే సమయంలో 5,880 మంది లొంగిపోయారని చెప్పారు. ఇక నిరుడు 364 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతం చేసినట్లు వెల్లడించారు. అలాగే గత సంవత్సరం 1,022 మందిని అరెస్ట్ చేశారని, 2,337 మందికి పునరావాసం కల్పించారని తెలిపారు.
వామపక్ష తీవ్రవాద హింసాత్మక సంఘటనలు 2010లో 1,936 జరగగా, 2025లో కేవలం 234 మాత్రమే నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. అంటే దాదాపు 88శాతం తగ్గినట్లు తెలిపారు. 2018లో దేశవ్యాప్తంగా లెఫ్ట్‌వింగ్ టెర్రరిజం ప్రభావం ఉన్న జిల్లాలు 126 ఉండగా, వాటి సంఖ్య 2025 డిసెంబర్ నాటికి 8కి తగ్గిందని ఆయన వెల్లడించారు (Naxals Arrested). వీటిలో మూడు జిల్లాలు మాత్రం ఇప్పటికీ అత్యంత తీవ్ర ప్రభావిత జాబితాలో ఉన్నాయని తెలిపారు.
నక్సలిజానికి మద్దతు తెలిపేవాళ్ల సంఖ్య తగ్గిందని మంత్రి తెలిపారు. మావోయిస్టులకు నిధులు అందకుండా చేయడంలో వివిధ రాష్ట్రాల పోలీసులతో కలసి కేంద్ర దళాలు సమర్థంగా పనిచేశాయని ఆయన అన్నారు. అలాగే, అభివృద్ధికి దూరంగా ఉన్న నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచినట్లు చెప్పారు. నక్సల్స్ లొంగిపోయేందుకు అనేక పునరావాస, ఉపాధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
Read Also: రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే!
Follow Us On: Pinterest


