కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ (Rajasthan) లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) సోమవారం ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు “లీవ్ ఇండియా”(Leave India) నోటీసులు జారీ చేసింది. పుష్కర్(Pushkar) లోని పలు ప్రజా ప్రదేశాల్లో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా స్టిక్కర్లు అతికించినందుకు ఈ చర్య తీసుకున్నారు. ఆ స్టిక్కర్లపై “ఫ్రీ పాలస్తీన్, బాయ్‌కాట్ ఇజ్రాయెల్” వంటి నినాదాలు ఉన్నాయి.
జనవరి 21న పుష్కర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ స్టిక్కర్లు కనిపించడంతో స్థానిక అధికారులు అప్రమత్తమై CIDకి సమాచారం అందించారు. అనంతరం విచారణ చేపట్టిన అధికారులు, ఈ చర్యలు స్థానిక సున్నిత భావాలను దెబ్బతీయడమే కాకుండా పర్యాటక వీసా నిబంధనలకు విరుద్ధమని నిర్ధారించారు.
CID అదనపు ఎస్పీ రాజేశ్ మీనా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరు వ్యక్తులు పర్యాటక వీసాలపై భారత్‌కు వచ్చిన లూయిస్ గాబ్రియెల్ డీ (36), అనుయేషి ఎమ్మా క్రిస్టిన్ (36) గా గుర్తించారు. వీసా నిబంధనలు ఉల్లంఘించినందున వారిని దేశం విడిచిపోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.


