కలం, వెబ్ డెస్క్: మంత్రి నారాయణ (Minister Narayana) బృందం లండన్‌లో పర్యటించింది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ గిన్ రిచర్డ్స్‌తో నారాయణ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. లండన్ నగర అభివృద్ధి దృక్పథం, భవిష్యత్ మాస్టర్ ప్లాన్, పట్టణ ప్రణాళికలు, ఆధునిక రవాణా సౌకర్యాలపై గిన్ రిచర్డ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నగర విస్తరణలో పాటిస్తున్న ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి విధానాలు, పర్యావరణ సమతుల్యత, ప్రజలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు.
ఈ ప్రజెంటేషన్‌ను మంత్రి నారాయణ (Minister Narayana) ఆసక్తిగా పరిశీలించి, లండన్‌లో అమలు చేస్తున్న పట్టణ ప్రణాళికలను భారత్‌లో, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల్లో ఎలా అన్వయించుకోవచ్చనే అంశంపై చర్చించారు. లండన్ లో అమలు చేస్తున్న ప్రణాళికలను అమరావతిలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్టు నారాయణ వెల్లడించారు. అమరావతిని ప్రపంచ ప్రఖ్యాత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
అనంతరం మంత్రి నారాయణ బృందం లండన్‌లోని ప్రముఖ బాటర్సీ పవర్ స్టేషన్‌ను సందర్శించింది. పునరాభివృద్ధి ద్వారా పాత విద్యుత్ కేంద్రాన్ని ఆధునిక వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా మార్చిన విధానాన్ని అక్కడి అధికారులు వివరించారు. వారసత్వ భవనాలను సంరక్షిస్తూ అభివృద్ధిని ఎలా సాధించవచ్చో బాటర్సీ పవర్ స్టేషన్ ఒక ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ పర్యటన ద్వారా అంతర్జాతీయ నగరాల అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసి, రాష్ట్రంలో అమలు చేయనున్న భవిష్యత్ పట్టణాభివృద్ధి ప్రణాళికలకు ఉపయోగపడే అంశాలను తెలుసుకోవడమే లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు.


