కలం, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం అధికార, ప్రతిపక్షాల మధ్య ఢీ అంటే ఢీ అనే రీతిలో మాటల యుద్ధం నడిచింది. ఆర్మీ మాజీ చీఫ్, జనరల్ ఎంఎం నరవణే రాసినట్లుగా చెప్పే ఓ పుస్తకంలోని వ్యాఖ్యల్ని(Naravane Memoir) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడం దీనికి కారణం. రాహుల్ వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, ఇరువైపులా మద్దతుగా సభ్యులు వాద ప్రతివాదాలకు దిగడంతో గందరగోళం చెలరేగింది. అనంతరం కాసేపటికే లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు.
ఏం జరిగిందంటే..
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే సమయంలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) డోక్లాం, లద్ధాఖ్ సంఘటనల గురించి ప్రస్తావించారు. ఆ ప్రాంతాల్లో చైనా దళాలు తిష్ఠ వేశాయంటూ.. ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసినట్లుగా చెబుతున్న ఓ పుస్తకంలోని మాటలను (Naravane Memoir) చెప్పారు. దీనిపై హోంమంత్రి అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆ పుస్తకం రిలీజ్ అయ్యిందా?’ అని ప్రశ్నించారు. ఇంకా విడుదల కాలేదని పేర్కొన్న రాహుల్.. నరవణే ఆత్మకథలోని ఆ మాటలు ఓ మ్యాగజైన్లో వచ్చాయన్నారు. దీంతో ఇంకా రిలీజ్ కాలేదని చెబుతున్న పుస్తకంలోని మాటల్ని రాహుల్ ప్రస్తావించడంపై అమిత్ షా, రాజ్‌నాథ్ తీవ్రంగా ఆక్షేపించారు. స్పీకర్ ఓం బిర్లా సైతం ఇది సరైన పద్ధతి కాదని రాహుల్‌కు సూచించారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర గందరగోళానికి దారితీసింది.
ఈ క్రమంలో కాసేపటికి డోక్లాం ప్రతిష్టంభన గురించి అప్పట్లో ఆర్మీ చీఫ్ నరవణే మాట్లాడిన మాటల వీడియోను అధికార పార్టీ సభలో ప్రదర్శించింది. దీనికి కౌంటర్‌గా రాహుల్ తన వ్యాఖ్యల్ని సమర్థించే ఆధారాలు తీసుకొచ్చారు. ఇంకా రిలీజ్ కాని నరవణే ఆత్మకథ ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’లోని కొన్ని మాటల్ని ప్రచురించిన ‘ది కారవాన్’ అనే మ్యాగజైన్‌ను సభలోకి తీసుకొచ్చి చూపించారు. దీంతో మళ్లీ గందరగోళం చెలరేగింది. ఎన్డీఏ, ఇండియా కూటమి సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమయినా గందరగోళం సద్దుమణగకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం తనను సభలో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. ‘నేను కేవలం ఆర్మీ మాజీ చీఫ్ నరవణే ఆత్మకథలోని మాటలను మాత్రమే ప్రస్తావించాను. ఆ రెండు సంఘటనల్లో మనం గెలిచామా? లేదా అని అడగలేదు. కానీ, ప్రభుత్వం మాత్రం ఉలికిపడింది. సభలో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది’ అని రాహుల్ అన్నారు.
Read Also: ఢిల్లీలో ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోంది: మమతా బెనర్జీ
Follow Us On : WhatsApp


