epaper
Monday, February 2, 2026
spot_img
epaper

తాడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపు.. రాజ్యసభలో ఎంపీ ప్రశ్న

కలం, వెబ్​ డెస్క్​ : తాడిచెర్ల కోల్ బ్లాక్ కేటాయింపు, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరుగుతున్న నిర్లక్ష్యంపై ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) రాజ్యసభలో పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల సమయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని పదేపదే కోరుతున్నప్పటికీ, తాడిచెర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)కు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందా అని బొగ్గు శాఖ మంత్రిని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నిర్ణయం తీసుకుని ఉంటే, దానికి సంబంధించిన స్థితి, కాలపరిమితి, విధివిధానాలను సభకు తెలియజేయాలని, ఒకవేళ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆలస్యానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించాలని ఆయన కోరారు.

తాడిచెర్ల కోల్ బ్లాక్ (Tadicherla Coal Block) వ్యూహాత్మక ప్రాధాన్యతను ప్రస్తావించిన ఎంపీ, ఈ బ్లాక్‌ను SCCLకు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇంధన భద్రత బలోపేతం అవుతుందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, బాహ్య బొగ్గు వనరులపై ఆధారపడే అవసరం తగ్గుతుందని, అలాగే ఉపాధి అవకాశాలు పెరిగి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.

అదేవిధంగా, కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav), తెలంగాణ ప్రజలు పెద్ద ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నెరవేరలేదని అన్నారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) స్థాపన, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–II, ప్రాంతీయ రింగ్ రోడ్ (RRR) వంటి కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులూ కేటాయించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడం తెలంగాణ అభివృద్ధి ప్రాధాన్యతల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని వ్యాఖ్యానించిన ఎంపీ, సహకార సమాఖ్య భావనను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన, సమతుల్యమైన బడ్జెట్ మద్దతు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర సమగ్ర, స్థిరమైన అభివృద్ధి కోసం తక్షణమే సవరణాత్మక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 Read Also: లోక్​సభను తాకిన ‘ఎప్​స్టీన్’​ సెగ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>