కలం, స్పోర్ట్స్ : భారత్ లాంటి విధ్వంసకర జట్టుకు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని, చాలా అంటే చాలా కష్టమని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చెప్పాడు. IND vs NZ ఐదో టీ20లో భారత్ బ్యాట్‌తో పాటు బాల్‌తో కూడా అదరగొట్టింది. బ్యాటింగ్‌లో బౌండరీల వరద సృష్టించింది. ఇక బౌలింగ్ విషయంలో తొలుత కాస్తంత పరుగులు సమర్పించుకున్నా ఆ తర్వాత వరుస వికెట్లతో బౌలర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 271 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ శతకం సాధించగా, సూర్యకుమార్ యాదవ్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు బలమిచ్చాడు.
లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఒత్తిడికి లోనైంది. ఫిన్ అలెన్ దూకుడుగా ఆడినా, ఇతర బ్యాటర్లు నిలబడలేకపోయారు. 19.4 ఓవర్లలో 225 పరుగులకే జట్టు ఆలౌట్ అయింది. భారత బౌలింగ్ విభాగంలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. సిరీస్‌ను కోల్పోయినా, ఈ పోరాటాలు తమకు విలువైన అనుభవాన్ని ఇచ్చాయని సాంట్నర్ పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త బౌలింగ్ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశాడు. ఈ సిరీస్ రెండు జట్లకు భవిష్యత్ సవాళ్లపై స్పష్టత ఇచ్చిన పోరాటంగా ముగిసింది.


