కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal elections)ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ (Congress) సర్కార్ గెలిచేందుకు వ్యుహాలకు పదునుపెడుతుంది. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సభలను మున్సిపాలిటీల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ (Miryalaguda) మున్సిపాలిటీ ఎన్నికలపై బీఆర్ఎస్ (BRS) మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తుంది. దీనికి తోడు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు, ఆయన కొడుకు సిద్ధార్థ హైప్ క్రియేట్ చేయడంతో ఇక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకునేందుకు కుందూరు బ్రదర్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. వాస్తవానికి మిర్యాలగూడలో త్రిముఖ పోరు ఉందనే చర్చ లేకపోలేదు. ఒకటి బీఆర్ఎస్ కాగా, మరో రెండు కాంగ్రెస్‌లో నుంచే పుట్టుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన వర్గాన్ని మున్సిపాలిటీ పీఠంపై కూర్చోబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తుండగా, కుందూరు బ్రదర్స్ వర్గం నేతలు సొంత కాంగ్రెస్ పార్టీలోనే తలనొప్పిగా తయారయ్యారు.
కాంగ్రెస్‌లోనే వర్గపోరు..
మిర్యాలగూడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం ఒకటి కాగా, కుందూరు వర్గీయులు మరో వర్గంగా మారిపోయారు. పైకి మాత్రం ఒక్కటి లాగానే కన్పిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం రగిలిపోతున్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అనుచరులు మిర్యాలగూడ కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉంటూ వస్తున్నారు. ఒకానొకదశలో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి జయవీర్ రెడ్డి పోటీ చేస్తారని భావించారు. కానీ చివరి నిమిషయంలో రఘువీర్ రెడ్డి తప్పుకోవడం.. బత్తుల లక్ష్మారెడ్డికి అవకాశం రావడంతో సమీకరణలు మారాయి. ఎమ్మెల్యేగా బీఎల్ఆర్ గెలిచినప్పటి నుంచి కుందూరు బ్రదర్స్ వర్గీయులను పక్కన పెడుతున్నారనే అసంతృప్తి పెరిగిపోయింది. కుందూరు బ్రదర్స్ ఒక అనుచరుడిని పోలీసు స్టేషన్‌లో చిత్రహింసలకు గురి చేశారనే ప్రచారం లేకపోలేదు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ (Miryalaguda) కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే బీఎల్ఆర్, కుందూరు వర్గీయులకు మధ్య మరింతగా గ్యాప్ పెరిగింది.


