కలం, వెబ్ డెస్క్: సమ్మక్క, సారలమ్మలు గద్దెకు చేరుకోవడంతో మేడారం జాతర(Medaram Jatara) ప్రాంగణం జన సంద్రంగా మారింది. బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్కను పూజారులు గద్దెలపై ప్రతిష్టించారు. సమ్మక్క ఆగమనంతో గురువారం ఒక్క రాత్రిలోనే లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలి వచ్చారు. ఒక్కసారిగా పోటెత్తిన భక్త జనంతో దారుల్లో నడవడానికి కూడా అవకాశం లేనంతగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. గద్దెల వద్ద భక్తులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. జాతరకు వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అక్కడ పెరిగిన రద్దీతో జంపన్నవాగు మార్గంలోని పలు దుకాణాల్లో దొంగతనాలు జరిగాయి. భారీ ఎత్తున సామగ్రి చోరీకి గురైనట్లు దుకాణాదారులు పేర్కొంటున్నారు. మరోవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వాహనం జాతరలో జనం మధ్య చిక్కుకుపోయింది. బయటకు వచ్చేందుకు కొంతసేపు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో ఆయన కాన్వాయ్ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో జాతరకు వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని, విలువైన వస్తువులతో పాటు, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.


