కలం, వెబ్ డెస్క్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ (BC Reservation)ను దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలకు చెందిన అభ్యర్థులను బీసీలుగా పరిగణించరాదని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొందరు అనర్హులు బీసీ కోటా కింద ఎన్నికైనట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని కలెక్టర్లు, ఎన్నికల అధికారులు అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, కేవలం ప్రభుత్వ గుర్తింపు పొందిన బీసీ జాబితాలోని అభ్యర్థులకే రిజర్వేషన్లు వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మెమో నెం.206/B/A2/2026ను గురువారం విడుదల చేసింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ జాబితాలో ఉన్న కులాలను పునర్విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలోని 26 కులాలు, ఒక పర్యాయపద కులానికి బీసీ హోదా లేదని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
రెడ్డి గండ్లకు బీసీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు..
రెడ్డి గాండ్ల కులానికి చెందిన వ్యక్తులకు బీసీ సర్టిఫికేట్లు జారీ చేయవద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టర్లందరికీ ప్రభుత్వం మెమో జారీ చేసింది. గతంలో జారీ చేసిన కొన్ని పాత ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ బీసీ రిజర్వేషన్లు అర్హులైన వారికే అందేలా చూడాలని అధికారులను ఆదేశించింది. ఎన్నికల అధికారులు, సంబంధిత శాఖలు కూడా ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెడ్డి గండ్ల వ్యక్తులు బీసీ రిజర్వేషన్ల (BC Reservation)ను దుర్వినియోగం చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం మరోసారి జారీ చేసింది.
Read Also: “పోలీసు పహారాలో కూల్చివేతలు” కథనానికి స్పందించిన మంత్రి తుమ్మల
Follow Us On: Sharechat


