epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

సారొస్తారా?.. అనారోగ్య కారణాలతో గైర్హాజరా?

కలం, తెలంగాణ బ్యూరో : గత కొన్ని రోజులుగా ఊహాగానాలుగా ఉన్న అంశం ఎట్టకేలకు గురువారం నిజమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు (SIT Notice to KCR) జారీ అయ్యాయి. హైదరాబాద్ పరిధిలో ఆయన సూచించిన స్థలంలోనే విచారణ జరిపేలా పోలీసులు వెసులుబాటు ఇచ్చారు. ఆ నోటీసు ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు విచారణ ప్రారంభం కానున్నది. మొత్తం ఆరుగురు అధికారుల బృందం ఆయనను ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రశ్నించి వివరాలను రాబట్టనున్నది. అయితే నోటీసులో పేర్కొన్నట్లుగా షెడ్యూలు టైమ్‌కు విచారణకు కేసీఆర్ హాజరవుతారా?.. అనారోగ్య కారణాలతో మరింత గడువు కావాలని అడుగుతారా?.. ఇతర కారణాలతో వాయిదా కోరుతారా?.. హరీశ్‌రావు, కేటీఆర్, సంతోషరావుల తరహాలోనే హాజరై వివరాలు ఇస్తారా?.. ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

గతంలో కాళేశ్వరం కమిషన్ ఎంక్వయిరీ :

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్రఘోష్ (Pinaki Chandra Ghose) ఎంక్వయిరీ కమిషన్ గతేడాది జూన్ 5న నోటీసు ఇచ్చింది. కానీ జలుబు, అనారోగ్యం కారణంగా హాజరుకాలేనంటూ వాయిదా కోరారు. ఆయన రిక్వెస్టుకు అనుగుణంగా జూన్ 11వ తేదీ వరకు కమిషన్ గడువు ఇచ్చింది. ఏకాంత విచారణ జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ సిట్ పోలీసులు జారీ చేసిన నోటీసు ప్రకారం జనవరి 30న హాజరుకావాల్సి ఉన్నది. టైమ్ ప్రకారం హాజరుకావడానికి బదులు గడువు కోరుతారేమోననే మాటలు వినిపిస్తున్నాయి. కనీసంగా నాలుగైదు రోజుల గడువు కోరవచ్చని సమాచారం. వృద్ధాప్యంలో ఉన్నందున ఆయన కోరుకున్న చోటనే హైదరాబాద్ నగర పరిధిలో విచారిస్తామని పోలీసులు వెసులుబాటు ఇచ్చారు. దీంతో అనారోగ్యాన్ని కారణంగా చూపితే సిట్ పోలీసులు గడువు పొడిగించడంపై సస్పెన్స్ నెలకొన్నది.

నోటీసుల్ని కోర్టులో సవాలు చేస్తారా?

కాళేశ్వరం (Kaleshwaram) కమిషన్ నోటీసు జారీ చేసిన తర్వాత దాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్ళకపోయినా జస్టిస్ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో కేసీఆర్‌పై అభియోగాలు మోపడాన్ని సవాలు చేశారు. శిక్షార్హమైన ఆరోపణలు చేసే ముందు కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్ సెక్షన్ 8-బి ప్రకారం తన వాదనను వినాల్సి ఉన్నదని, కానీ కమిషన్ ఆ నిబంధన పాటించలేదని కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణ వరకు కఠిన చర్యలు వద్దని హైకోర్టు స్పష్టం చేసింది. దానికి ముందు విద్యుత్ కొనుగోళ్ళ అంశంలోనూ జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటునే తప్పుపడుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు. చివరకు ఆయన బదిలీ అయ్యి ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్ వచ్చారు. కేసీఆర్‌ను విచారించకుండానే ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. ఇప్పుడు ఫోన్ ట్యపింగ్ నోటీసు (SIT Notice to KCR) విషయంలో కోర్టును ఆశ్రయిస్తారా?.. లేక హాజరై వివరాలు అందిస్తారా?.. లేక నివేదిక వచ్చిన తర్వాత దాన్ని సవాలు చేస్తారా?.. ఇలాంటి సందేహాలు నెలకొన్నాయి. లీగల్ నిపుణులతో సంప్రదింపుల తర్వాత కేసీఆర్ నిర్ణయం వెలుగులోకి రానున్నది.

Read Also: ఆ 2 అంశాలపై మంత్రులతో సీఎం డీప్ డిస్కషన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>