కలం, వెబ్ డెస్క్: కవితను కాంగ్రెస్ పార్టీని చేర్చుకొనే ప్రసక్తేలేదని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ (Madhu Yashki Goud) పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న కవితను ఎలా చేర్చుకుంటామని ప్రశ్నించారు. “కవిత (Kavitha) టీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఆ పార్టీని మట్టికరిపించాం. ఇప్పుడు ఆమెను తీసుకునే దుస్థితి కాంగ్రెస్కు లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు ప్రాణత్యాగాలు చేస్తే, కేటీఆర్, హరీశ్ రావు, కవిత అమెరికాలో కంపెనీలు పెట్టారని మధు యాష్కీ విమర్శించారు. 2010లోనే వారు కంపెనీలు స్థాపించారని, కవిత ఉద్యమంలోనూ రాజకీయాల్లోనూ సంపాదించి మూడు వేల కోట్లతో రాజభవన్ కట్టుకుందని ఆరోపించారు. రాజకీయాల్లోకి వచ్చాక జిల్లాకు ఒక పీఏను కూడా పెట్టుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు బలహీనంగా ఉన్నాయని మధు యాష్కీ (Madhu Yashki Goud) అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పోలీసు అధికారులు పార్టీ కార్యకర్తలుగా పనిచేసి అక్రమంగా సంపాదించారని, “ఫ్రెండ్లీ పోలీస్” అంటే డ్రగ్స్ పెడ్లర్లకు అనుకూలమైన పోలీసులని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలని చెబుతున్నారని, కానీ కొందరు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అమాయకులపై ప్రతాపం చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నైని బొగ్గు బ్లాక్లో (Naini Coal Block) టెండర్లు కేటాయింపు జరగలేదని, బొగ్గు తవ్వకం లేదన్న మధు యాష్కీ, అక్కడ స్కామ్ ఎలా జరుగుతుందని నిలదీశారు. బీజేపీ ఎంపీలు ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్లు గెలిచారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన చోట సమన్వయ లోపం జరుగుతోందని అన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరిన నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దానం నాగేందర్ అంశం స్పీకర్ పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య పూర్తి అవగాహన ఉందని, అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారని మధు యాష్కీ ధీమా వ్యక్తం చేశారు.
అనుభవజ్ఞులైన సీనియర్లు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తారని తెలిపారు. గతంలో కేసీఆర్ (KCR) తనను ఎన్నోసార్లు పార్టీలోకి ఆహ్వానించారని.. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. పార్టీ మారాలనుకుంటే ఆయన హయాంలోనే మారేవారమని స్పష్టం చేశారు. ఒక దశలో హైకమాండ్ జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని ఆలోచించిందని కూడా ఆయన ప్రస్తావించారు.
Read Also : బాలుడి మృతికి కారణమైన నిందితులకు ఏడేళ్ల జైలు
Follow Us On: Pinterest


